19-08-2024 12:00:00 AM
25న సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి :
ఎన్నదగిన తెలంగాణ వైతాళికులలో ఒకరు సురవరం ప్రతాపరెడ్డి. రచయి త, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడుగా ఆయన పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది ‘గోలకొండ కవుల సంచిక’. ‘తెలంగాణలో కవులే లేరన్న’ నిందాపూర్వక విమర్శకు సమాధానంగా వందలాది కవుల తో బృహత్ సంకలనాన్ని వెలువరించి చరిత్ర సృష్టించారు. ప్రతాపరెడ్డి వారు సంపాదకులుగా ప్రచురితమైన ఈ అపురూప గ్రంథంలో తెలంగాణ జిల్లాలోని లబ్ధప్రతిష్ఠులైన మొత్తం 354 మంది కవులు, పండితులకు చెందిన 1,418 పద్యాలు వున్నాయి. కులాలు, ప్రాంతాల వారీ గా కవులను విభజించి మరీ సంకలన పరచడం ఇందులోని విశేషం. ఈ గ్రంథం తొలిసారిగా 1934లో వెలువడగా, తెలంగాణ ప్రాంతీయ స్పృహ నేపథ్యంలో 68 సంవత్సరాల తర్వాత ఎనిమిదేళ్ల క్రితం పునర్ముద్రణకు నోచుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో రంగమ్మ దంపతులకు ప్రతాపరెడ్డి 1896 మే 28న జన్మించారు. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం తర్వాత రెడ్డి హాస్టల్ నిర్వహణను చేపట్టి, దానిని ఒక విద్యాలయంగా తీర్చిదిద్దారు. నాటి నిజాం రాష్ట్రాంధ్ర దుస్థితిని మార్చడానికి ఎంతో కృషి చేశారు. 1926లో ‘గోలకొండ’ పత్రికను స్థాపించారు. అందులోని ఘాటైన సంపాదకీయాలు పెద్ద సంచలనం. 1951లో ‘ప్రజావాణి’ పత్రికనూ ప్రారంభించిన మరో రెండేళ్లకు, 57 ఏళ్ల వయసులో 1953 ఆగస్టు 25న వారు దివంగతులైనారు.