calender_icon.png 16 May, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసులు కురిపిస్తున్న కార్పొరేట్ విద్య

18-08-2024 12:00:00 AM

పట్ట హరిప్రసాద్ :

దేశంలో ప్రతి పౌరుడికి  విద్య, సమాన అవకాశాలను మన రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. కానీ, రంగంలోకి ప్రైవేట్ విద్యా వ్యవస్థ వచ్చి, బాగా వేళ్లూనుకుని పోయింది. పోటీ పెరిగిపోయి కార్పొరేట్ రంగంగానూ మారింది. ఎప్పుడైతే విద్య వ్యాపార వస్తువుగా మారిందో లాభాలే లక్ష్యంగా పని చేయడం ప్రారంభమైంది. 

ఒక దేశాన్ని కానీ, ఒక సమాజాన్ని గానీ సర్వనాశనం చేయాలంటే ఇతర దేశాలు దాడి చేయడం, పెద్ద పెద్ద అణుబాంబులు వేసే అవసరం లేదు. ఆ దేశ  విద్యా వ్యవస్థను నాశనం చేస్తే చాలు, దేశం దానంతట అదే పతనమైపోతుంది. మన దేశంలో నాణ్యతా విలువలు లేని విద్యా వ్యవస్థ, మాస్ కాపీయింగ్,  లీకేజీల ప్రోత్సాహానికి ఎక్కువ ప్రాధాన్యత లభి స్తోందనిపిస్తోంది. విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంటే, దీర్ఘ కాలంలో తయార య్యే డాక్టర్ల చేతిలో పేషెంట్ బలవుతాడు. ఇంజనీర్ చేతిలో భవనాలు కూలిపోతా యి.  జడ్జిల చేతుల్లో న్యాయం అన్యాయం అయిపోతుంది, ఆర్థిక వేత్తల చేతుల్లో ఆర్థిక విధానం నలిగిపోతుంది. ఏ దేశంలో అయితే విద్య నాశనం అవుతుందో ఆ దేశం పతనం అయిపోతుంది. విద్య వ్యక్తి వికాసం కోసమని, జ్ఞాన సముపార్జన  కోసమని, ఆ మనిషి సమున్నతి కోసం పని చేస్తుందని అంటారు.  కానీ.. నేటి వ్యవస్థలో విద్యా వ్యవస్థ ఓ పెద్ద వ్యాపార వస్తువుగా మారిపోయింది.

స్వాతంత్య్రాన్ని కోల్పోక ముందు భార తదేశం ప్రపంచ దేశాలకు అక్షరకేంద్రంగా ఉండేది. ఆయుర్వేదం, అస్ట్రానమీ, ఫిలాస ఫీ, గణితం వంటి సబ్జెక్ట్‌లకు సట్డీ సెంటర్‌గా విలసిల్లటం  విశేషం. అయితే ఈ ఘనత అంతా ఆంగ్లేయుల పాలనలో క్రమంగా అంతమైంది. ‘గతం’లా మాసిపోయింది. ఆధునికత జాడలేని ఆ రోజుల్లోనే భారత దేశంలో విద్యాబోధన ఆదర్శంగా నిలిచింది. అందుకే ఇతర దేశాలనుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చే వారు. కానీ బ్రిటీష్ ప్రభుత్వం మన చదువులను వాళ్ల కు అవసరమైన విధంగా మార్చుకుంది. దీనితో అది తనదైన ముద్రను కోల్పోయింది. ఏళ్లకొద్దీ సాగిన స్వాతంత్య్ర పోరా టం 77 ఏళ్ల క్రితం ఫలించడంతో భారతీయ విద్యావిధానం ఇప్పటి రూపాన్ని సంతరించుకోవడంలో ఎన్నో ఎత్తుపల్లాలను  చవిచూసింది. స్వేచ్ఛా వాయువు లను పీల్చుకుంటూ స్వీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. 1947లో 12 శాతమే ఉన్న అక్షరాస్యతిప్పుడు 77 శాతానికి పైగా పెరగడం చెప్పుకోదగ్గ గొప్ప విజయం. వందశాతం అక్షరాస్యతను సాధించే దిశగా దేశం శరవేగంగా పరుగులు తీస్తోంది.

వ్యాపార వస్తువుగా విద్య              

మౌలిక వసతుల్లో విద్య ప్రధానమైనది. విద్యా రంగం ద్వారా మానవ వనరులను మరింత బలంగా తీర్చి దిద్దుకోవచ్చు. దేశంలో ప్రతి పౌరుడికి  విద్య, సమాన అవకాశాలు, మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. కానీ విద్యా రంగంలోకి ప్రైవేట్ విద్యా వ్యవస్థ వేళ్లూనుకుని పోయింది. పోటీ పెరిగిపోయి కార్పొరేట్ రంగంగా మారిపోయింది.. ఎప్పుడైతే విద్య వ్యాపార వస్తువుగా మారిందో  లాభాలే లక్ష్యం గా పని చేయడం ప్రారంభమైంది. దాంతో లాభాల  కోసం అక్రమాలకు దారితీసింది. పత్రికలు, టీవీ చానల్స్‌లో, వివిధ రకాల ప్రకటనలు, యాడ్స్‌లో ప్రైవేట్ విద్యా సంస్థలు ర్యాంకులు సాధించినట్లు చెప్పుకుంటున్నాయి.

ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వ హణకు  ప్రభుత్వ పర్యవేక్షణ, ప్రమేయం అవసరం ఉంటుంది. అయితే ప్రైవేట్-తో ప్రభుత్వ రంగంలో ఉన్న స్వార్థపరులు చేతులు కలపడంతో అవినీతి, అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. దేశంలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే పేపర్ లీక్ అయింది. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, జూన్‌లో రాసిన నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నీట్) రద్దయింది. తరువాత నీట్ పీజీ పరీక్ష కూడా వాయిదా పడింది. ఈ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోం ది. అయితే లీకేజీలపై వేసిన హైపవర్ కమిషన్ చైర్మన్ గా ఎన్ట్టీఏ చైర్మన్‌ను నియమిం చడం పలు ఆరోపణలకు దారి తీస్తోంది.

రకరకాల విద్యార్హతలు కలిగిన ఫేక్ సర్టిఫికెట్లు, స్కామ్‌లు వెలుగు చూస్తూనే  ఉన్నాయి. తెలంగాణలో 2014 నుండి ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నిర్వహించిన 15 పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి. ఆంధ్రాలో 2022 లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిం ది. కానీ అక్కడ ఎలాంటి పోటీ పరీక్షల పేపర్లు లీక్ కాలేదు. అంటే అక్కడ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారని కాదు. అక్కడ అసలు ఎలాంటి ఉద్యోగ నియామక ప్రకటనలు చేయలేదు. దానికి మరో కారణం ఉంది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా మరో అవినీతి యంత్రాంగం తయారు కావడమే.

వందకోట్ల కుంభకోణాలు

పేపర్ లీకేజీల వెనుక 100 కోట్ల కుంభకోణాలు దాగి ఉన్నది. ఈ లీకేజీలు ఎక్కు వ సంపద కలిగిన వ్యక్తుల కోసం చేస్తున్నట్లుంది.  ఎకనామిక్ అండ్ పొలిటికల్, బిజినెస్ స్టాండర్స్ గణాంకాల ప్రకారం బ్లాక్ మనీని ఉత్పత్తి చేస్తున్న వాటిలో ఫార్మాస్యూటికల్, రియల్ ఎస్టేట్ తో పాటు విద్యారంగం కూడా చేరిపోయింది. దీన్ని బట్టి విద్యా వ్యవస్థలో అవినీతిని అంచనా వేయవచ్చు. అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్స్, పొలిటికల్ ఇమేజ్‌తో వచ్చి రూల్స్ కు వ్యతిరేకంగా నియామకాలు, భవనాల నిర్మాణాల్లో అవినీతితో  కోట్లు సంపాదిస్తున్నారు. తరువాత రాజకీయాల్లోకి వచ్చి విద్యారంగంలో చేసిన తప్పులను మాఫీ చేసుకుంటున్నారు. ఎన్ని అక్రమాలకు పాల్పడినా.. ఏ అధికారి అక్రమాలైనా రుజువయినట్లు, లేదా శిక్ష పడిన దాఖలాలు లేవు.

అందుకే అక్రమాలు రోజురో జుకీ పెరిగిపోతున్నాయి. అవినీతి చేయడం ఆ డబ్బుతో మళ్ళీ రాజకీయాల్లోకి రావ డం, వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చు కోవడమే జరుగుతోంది. ఇలా దేశంలో విద్య నిర్వీర్యం అయితే ఆ దేశాలు పతనమవడం ఖాయం. ఇందులో సందేహమే లేదు. అయితే విద్యా వ్యవస్థలో చాలామంది నిజాయితీగా పనిచేసే అడ్మినిస్ట్రేట ర్స్, ఎంటర్‌ప్రెన్యూవర్స్ కూడా ఉన్నారు. చట్ట ప్రకారం పని చేయడం వారికి కఠినంగా మారుతోంది. ఒకపక్క రాజకీయ ఒత్తిళ్లు, మరోపక్క అవినీతి విధానాల నుంచి నిజాయితీగా పనిచేసే అడ్మినిస్ట్రేటర్స్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభు త్వాలు, ప్రజలపై ఉంది. భవిష్యత్ తరాల కోసం వీరికి రక్షణ కల్పించవలసిన అవసరం కూడా ఉంది.

రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిని చట్ట ప్రకారం శిక్షించాలి. నిర్వీర్యం అవుతున్న విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి రెగ్యులేషన్,  అక్రమాల నియంత్రణకు కఠిన చట్టాలు వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉం ది. చట్ట ప్రకారం పని చేస్తున్న వారికి రక్షణ ఇచ్చి విద్యా ప్రమాణాలు, నైతిక విలువలు పెరిగేలా, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా. విద్య వ్యవస్థను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు సమాజంలోని మేధావులు దృష్టి సారించాలి. 

ఈ నేపథ్యంలో తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించడం సంతోషకరమైన విషయం. పాఠ శాల విద్యనుంచి యూనివర్సిటీ విద్య దాకా సమూల మార్పులు తీసుకువస్తామని ఆయన చెప్పారు. ఇకపై ఒకటో తరగతినుంచి 12వ తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్‌గా నిర్ణయించారు. మార్పుల్లో భాగంగా ఇప్పటికే డిగ్రీలో క్లస్టర్ విధానం, కామన్ పీజీ ఎంట్రన్స్ పరక్షకు శ్రీకారం చుట్టారు. అలాగే పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా కామన్ ఎంట్రన్స్ విద్యావిధానం అమలులోకి రానుంది. క్లస్టర్ విధానంపై అధ్యయనానికి ఉన్నతవిద్యామండలి కమిటీని కూడా వేసింది. విధానం అమలులోకి వస్తే దూరప్రాంతాలకు వెళ్లి చదివే విద్యార్థులు తమకు దగ్గర్లోనే ఉండే విద్యాసంస్థల్లో చదువుకునే వీలు కలుగుతుంది.