calender_icon.png 12 January, 2026 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా మూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు

12-01-2026 09:02:20 PM

13 నుంచి  దుద్దెడ శంభు దేవుని సంబరాలు

వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన దేవాలయం

ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

కొండపాక: తెలంగాణ శివాలయాలకు ప్రసిద్ధి చక్కటి శిల్ప సంపదతో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో ఇప్పటికే ప్రతియటా ఉత్సవాలు జరుగుతాయి. అలాంటి దేవాలయాల్లో ప్రసిద్ధి పొందినది కొండపాక మండలం దుద్దెడ స్వయంభూ శంబు దేవాలయం భక్తుల కోరిన కోరికలు తీర్చే  స్వయంభు శంభుదేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు  వైభవంగా జరుగుతాయి. ప్రతి ఏటా ఈ ఉత్సవాలు పుష్య బహుళ దశమి నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవాలయాన్ని రంగు రంగు దీపాలతో అలంకరించారు. పందిళ్ళు వేశారు. మూడో రోజున జరిగే శివపార్వతులకళ్యాణం అట్టహాసంగా జరుగుతుంది.

ఈ నెల 13 న మంగళవారం  రోజున విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని స్వయంభూ శంభు లింగేశ్వర సేవాసమితి ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పుణ్యాహవచనము, అంకురార్పణ, మూలవిరాట్ అభిషేకము, సాయంత్రం శకటోత్సవం దేవాలయం చుట్టూ వాహనాలు బండ్లు తిరగడం,  అనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. బుధవారం రోజున స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకము, శంభు దేవునికిఅన్నాభిషేకం, మూలవిరాట్ కు అలంకారం, రుద్ర హోమం చండీ హోమం  జరుగుతాయన్నారు. రాత్రి దిష్టి కుంభాలనిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు.

మూడో రోజు గురువారం ఉదయం స్వామివారి ఎదుర్కోలు, అనంతరం అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్నదాన వితరణ, రాత్రి స్వామివారి రథోత్సవం, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు స్వయంభు శంబు దేవాలయ ట్రస్టు చైర్మన్ మంచాల శ్రీనివాస్ తెలిపారు. వేదిక నిర్మాణం గొల్లపల్లి రఘురామ శర్మ, కోట శ్రీనివాసశర్మల వ్యవహరిస్తారని తెలిపారు.