calender_icon.png 13 January, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల పరిశీలన

12-01-2026 09:39:18 PM

నాడు 2 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించాం

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్మాణ పనులను నిలిపివేసింది

నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు  చిరుమర్తి లింగయ్య

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్లతో మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు.

కానీ నేటి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నేడు ఈ నిర్మాణ పనులను నిలిపివేసిందని అన్నారు. పట్టణాన్ని మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నాడు అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశామని, అందులో భాగంగానే ప్రజలకు అవసరమైన సౌకర్యాలతో కూడిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించామని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని మంజూర్లు ఇచ్చి పనులు కూడా ప్రారంభించామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలసత్వం, నిర్లక్ష్యం, చేతకాని తనంతో ఆ పనులను నిలిపివేసిందన్నారు.

తాము చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేసి, తమ హయాంలో మంజూరైన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేయడం కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పటివరకు ఒక్కరోజైనా పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించలేదంటే ఆయనకు ఈ ప్రాంతంపై ఎలాంటి ఆలోచన ఉందో పురవాసులు ఆలోచన చేయాలని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మార్కెట్ యార్డు కాంప్లెక్స్ నిర్మాణానికి దాదాపు కోటిన్నర నిధులు మంజూరు చేసి, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పనులు పూర్తిచేశామని, తాము పూర్తి చేసిన కాంప్లెక్స్‌ శిలాఫలాకాన్ని తొలగించి కొత్త శిలాఫలకంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

గత రెండేళ్లలో పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే ఏం చేశారో ప్రజలకు తెలియజేస్తూ, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు విచ్చలవిడిగా అక్రమ దందాలకు పాల్పడుతూ, సంక్షేమ పథకాల అమల్లో కొర్రీలు పెడుతూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు సూట్‌కేసులు, డబ్బు సంచులతో తిరుగుతూ ప్రజలను మభ్య పెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారని, పట్టణ ప్రజలు ఆలోచించి ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నానని ఆయన తెలిపారు.