12-01-2026 09:58:38 PM
మంథనిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారులపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి శ్రీదర్ బాబు మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ. 50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదన్నారు.
రాజకీయపరంగా ఏమైనా ఉంటే రాజకీయపరంగానే ముందుకు తీసుకెళ్లాలని ఇలాంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదన్నారు. అదేవిధంగా జిల్లాల పునర్విభజనపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు లేవనీ తెలిపారు. మంథని పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి పాటుపడతామని, త్వరలోనే మంథని నియోజకవర్గంలో మార్పు చూపిస్తామని హామీ ఇచ్చారు.