calender_icon.png 13 January, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సమాయత్తంగా ఉండాలి

12-01-2026 09:51:22 PM

 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

నిజామాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సమాయత్తం అయి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి మున్సిపల్ శాఖ కార్యదర్శి టీ.కే.శ్రీదేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఫోటో ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఫోటోతో కూడిన ఓటరు తుది జాబితాను నేడు (సోమవారం) ప్రకటించడం జరిగిందని, ఈ నెల 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన అనంతరం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించి పరిశీలన, పరిష్కారం చేసిన మీదట ఈ నెల 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ ప్రచురణ కోసం ప్రింటింగ్ ప్రెస్ లను గుర్తించడం వంటి పనులు పూర్తి చేయాలని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసే లోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ... జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరుగుతోందని తెలిపారు. తుది ఓటరు జాబితా ప్రకటన, ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రకటించి, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎన్నికల నిర్వహణ కొరకు నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాలు, సెక్టోరియల్ అధికారులు, నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, బోధన్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, పి.శ్రావణి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.