02-08-2025 07:24:21 PM
చిట్యాల (విజయక్రాంతి): తల్లిపాలు అన్నింటికన్నా శ్రేయస్కరమని, పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టించాలని ఎంపీడీవో జయశ్రీ(MPDO Jayasree) అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎంపీడీవో జయశ్రీ హాజరై తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. గర్భం ధరించిన ప్రతి మహిళ డెలివరీ అయిన వెంటనే ముర్రు పాలు పట్టించాలని, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు తాగించాలని సూచించారు.
రెండు సంవత్సరాలు పూర్తయ్యేంతవరకు తల్లిపాలు కొనసాగిస్తూ, అదనంగా బాలమృతం తినిపించాలని తెలిపారు. సమతుల్య ఆహారం, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వర్షాకాలము అయినందున పరిశుభ్రమైన మంచినీటిని తాగాలని వివరించారు. అలాగే ఒక బాబుకు అన్నప్రాసన, ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసము చేయించి జెండా ఊపి ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయప్రద, అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి, అరుణ, భాగ్యమ్మ, సుజాత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.