02-08-2025 07:30:41 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..
హనుమకొండ (విజయక్రాంతి): హాస్టల్స్ విద్యార్థులకు నాణ్యమైన, మెనూ ప్రకారం భోజనం అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అన్నారు. శనివారం హనుమకొండ గాంధీనగర్ టీవీ టవర్ సమీపంలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల వసతిగృహం(బి), హనుమకొండ బాలసముద్రంలోని బాలికల కళాశాల వసతి గృహం(ఏ)ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అదేవిధంగా వసతి గృహాలకు సంబంధించిన వివిధ రకాల రిజిస్టర్లను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, వారి హాజరు శాతం గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్ లలో ఉన్న కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను పరిశీలించారు. విద్యార్థులకు ఏయే రోజులలో ఆహార పదార్థాలను అందించాలని తెలియజేసే మెనూ చార్ట్ ను కలెక్టర్ పరిశీలించారు.
వసతి గృహ కార్యాలయాలు, కిచెన్, స్టోర్ రూమ్ లను పరిశీలించిన కలెక్టర్ డైనింగ్ హాలులో విద్యార్థుల కోసం వండిన భోజన పదార్థాలను కలెక్టర్ తనిఖీ చేశారు. వసతి గృహాలకు సంబంధించిన వివరాలను సంబంధిత హాస్టల్ వార్డెన్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, తాజా కూరగాయలనే వంటలలో వినియోగించాలన్నారు. హాస్టల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరును అందించాలన్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించినప్పుడు విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను నమోదు చేయాలన్నారు. హాస్టల్స్ లో రోజు అటెండెన్స్ తో పాటు వివిధ రికార్డుల నిర్వహణ తప్పనిసరిగా చేయాలన్నారు. హాస్టల్స్ లో సిబ్బంది ఒకరు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ డిడి నిర్మల, ఏఎస్ డబ్ల్యూఓ కృష్ణ, వార్డెన్లు రవికుమార్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.