calender_icon.png 3 August, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ముగిసిన ఆపరేషన్ ముస్కాన్

02-08-2025 09:46:40 PM

143 మంది బాలల గుర్తింపు.

65 కేసులు నమోదు

బాలల రక్షణకోసం నిరంతర తనిఖీలు 

బాలలను వెట్టిచాకిరికి గురిచేస్తే చర్యలు తప్పవు

ఎస్పీ కె.నరసింహ

సూర్యాపేట,(విజయక్రాంతి): వెట్టిచాకిరికి, నిరాదరణకు గురైన బాలబాలికలకు, తప్పిపోయి వచ్చిన బాలలను గుర్తించి సంరక్షించడం లో బాగంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దానిలో భాగంగా ఈ సంవత్సరం ఆపరేషన్ ముస్కాన్ ముగిసిందని ఎస్పి నరసింహ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జూలై నెలలో నెలరోజుల పాటు జిల్లా పోలీసు, జిల్లా యంత్రాంగం, బాలల రక్షణ, లేబర్, రెవెన్యూ, హెల్త్ మొదలగు డిపార్ట్మెంట్ ల అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంను పగడ్బందిగా నిర్వహించామని తెలిపినారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా నిరాదరణకు, వెట్టిచాకిరీ గురవుతున్న 143 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సంరక్షులకు క్షేమంగా అప్పగించడం జరిగినదన్నారు.

వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 76 మంది బాలలు ఉండగా వారిలో బాలికలు 7 గురు, 69 బాలురు ఉన్నారన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 67 మంది బాలలు ఉండగా బాలురు 50 మంది, బాలికలు 17 మంది ఉన్నారన్నారు. అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా రెస్క్యూ టీమ్స్ వివిధ ప్రదేశాల్లో వీరందరినీ గుర్తించి వీరికి రక్షణ కల్పించడం జరిగినదన్నారు. బాలకార్మిక వ్యవస్థ సమూలంగా నిర్మూలించి బాలల వికాసానికి ప్రతిఒక్కరూ తోడ్పడాలని అన్నారు. భాలల రక్షణలో పోలీసు తనిఖీలు నిరంతరంగా నిర్వహిస్తామని అన్నారు. బాలల వికాసానికి, బంగారు భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని కోరినారు. వెట్టిచాకిరి గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. అలాగే ఈ ఆపరేషన్ లో బాగా పనిచేసిన పోలీస్, ఇతర శాఖల అధికారులను అభినందించారు.