31-10-2025 02:01:45 PM
 
							చండూరు,(విజయక్రాంతి): కుల, మత, వర్గ,లింగ బేధాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని చండూరు సిఐ ఆదిరెడ్డి(Chandur CI Adireddy) అన్నారు. శుక్రవారం చండూరు పట్టణంలో భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా చండూరుపోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చండూరు సిఐ ఆదిరెడ్డి హాజరయ్యారు. డాన్ బాస్కో కాలేజ్ నుండి 2 కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు.
రన్ లో పట్టణ పోలీసులు, విద్యార్థులు, యువతతో పాటు, వాకర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఐక్యత స్ఫూర్తితో సమాజంలో శాంతి సహకారం నెలకొల్పేలా ప్రజలు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత తరుణంలో మనందరం అనేక మానసిక ఒత్తుళ్ళు, పని భారం, ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రక్షణ కొరకు ప్రతి ఒక్క యువత నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చండూరు ఎస్ ఐ ఎన్.వెంకన్న, డాన్ బాస్కో కాలేజ్ కరస్పాండెంట్ డాక్టర్ విల్సన్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువత, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.