calender_icon.png 15 September, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెన్యూవల్ జాన్తా నై

15-12-2024 02:48:54 AM

గ్రేటర్‌లో రోడ్డెక్కుతున్న 20 లక్షలకు పైగా కాలంచెల్లిన వాహనాలు

1.15 లక్షల వాహనాలకే గ్రీన్ ట్యాక్స్ 

స్క్రాప్ పాలసీ ఉన్నా చర్యలు శూన్యం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1౪ (విజయక్రాంతి): హైదరాబాద్ మహా నగరంలో మెట్రో, ఎంఎంటీఎస్, సిటీ బస్సులు వంటి ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ.. మెజారిటీ ప్రజలు వ్యక్తిగత వాహనాలను వినియోగించేందుకే  మొగ్గుచూపిస్తుండటంతో ట్రాఫిక్ రద్దీ నిత్యం పెరుగుతూ వస్తోంది. ఉరుకుల, పరుగుల జీవితంలో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా వాహనాలు కూడా అత్యవసర వస్తువుల జాబితాలో చేరిపోయాయి.

ప్రతి ఇంట్లో ఒకటి లేదా అంత కంటే ఎక్కువ వాహనాలు ఉంటున్నాయి. అవన్నీ రోడ్డుపైకి రావడం ఒక ఎత్తయితే.. కాలం చెల్లిన వాహనాలు కూడా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ రద్దీతో పాటు వాయుకాలుష్యానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా గడువు ముగిసిన వాహనాలకు సామర్థ్యం ఉన్నదీ.. లేనిదీ తేలీకుండానే రోడ్డెక్కడంతో పొల్యూషన్‌తో పాటు ప్రమాదాలకు కారణం అవతున్నాయి.

గ్రేటర్‌లో 20 లక్షలకు పైగానే.. 

హైదరాబాద్ ఆర్టీయే పరిధిలోని ఖైరతాబాద్ (సెంట్రల్ జోన్), మలక్‌పేట (ఈస్ట్‌జోన్), టోలిచౌకి (వెస్ట్ జోన్), తిరుమలగిరి (నార్త్‌జోన్), చాంద్రా యణగుట్ట (సౌత్‌జోన్) ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి ఏడాది సరాసరి 1.80 లక్షల నూతన వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. గత పదేళ్లలో 18,15,771 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో టూవీలర్లు అత్యధికంగా 14.10 లక్షలు, కార్లు 3.05 లక్షలు, 73,994 ఆటోలు, 21,527 క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు 3,338 ఉన్నాయి. ఇదిలా ఉండగా.. 15 ఏళ్ల గడువు ముగిసిన వాహనాలు మొత్తం 13,74,958 ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

వీటిలో అత్యధికంగా 11లక్షలకు పైగా టూవీలర్లు, 2.45 లక్షల కార్లు, 11వేలకు పైగా ఆటోలు, క్యాబ్‌లు 8,319, మ్యాక్సి క్యాబ్‌లు 1,249 ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోని 5 ఆర్టీయే కార్యాలయాల పరిధిలోనే 15 ఏళ్ల గడువు ముగిసిన వాహనాలు 13.74 లక్షలకు పైగా ఉండగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో కలిపితే గ్రేటర్ పరిధిలో మొత్తం 20 లక్షలకు పైగా కాలంచెల్లిన వాహనాలు ఉన్నట్లు అధికారిక అంచనా.

లక్ష వాహనాలకే రెన్యూవల్.. 

సాధారణంగా కొనుగోలు చేసిన 15 ఏళ్లకు ప్రతి వాహనం కాలపరిమితి ముగిసిపోతుంది. ఒకవేళ ఆ వాహనాన్ని వాహనదారుడు ఇంకా వినియోగించాలని అనుకుంటే ఆర్టీయే అధికారుల వద్ద సామర్థ్య (ఫిట్‌నెస్) పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఫిట్‌నెస్ ఉన్నట్టుగా అధికారులు నిర్ధారిస్తే ఆ వాహనానికి గ్రీన్‌ట్యాక్స్‌తో మరో ఐదేళ్ల పాటు నడపడానికి అనుమతిస్తారు.

తాజా గణాంకాల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 15 ఏళ్లు ముగిసిన వాహనాలు 13.74 లక్షలు ఉండగా, వాటి లో సామర్థ్య పరీక్షకు హాజరై, గ్రీన్ ట్యాక్స్ పొందిన వాహనాలు కేవలం 1.15 లక్షల వాహనాలు మాత్రమే. గడువు ముగిసిన వాహనాలతో బ్రేక్ ఫెయిల్ కావడం, క్లచ్‌లు గట్టిగా మారడం, వాహనాన్ని సురక్షితంగా ఆపగలిగే డ్రైవర్ తన సామర్థ్యాన్ని కోల్పోయేందుకు కారణమవుతూ ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నట్టు నిపుణులు చెబుతున్నారు. 

ఈ వాహనాలతో రాష్ట్ర వ్యాప్తం గా 1,306 ప్రమాదా లు చోటు చేసుకున్నా యి. ఈ ప్రమాదాలలో 418 మంది మరణించగా, 1,100 మందికి పైగా గాయాల పాలయ్యారు. పైగా ఈ తరహా వాహనాలు ప్రమాదకరమైన కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తూ తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతున్నాయి. 

స్క్రాప్‌పాలసీ ఉన్నా చర్యలు శూన్యం

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి స్క్రాప్ పాలసీ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు 15 ఏళ్లు దాటిన వాహనాలను, కాలంచెల్లిన వాహనాలు తిరిగి ఫిట్‌నెస్ పొందాల్సి ఉంటుంది. సామర్థ్య పరీక్ష ఎదుర్కోని వాహనాలను సీజ్ చేయడం, అట్టి వాహనాలను నడుపుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయంలో నెలరోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్క్రాప్ పాలసీని ప్రకటించారు.

అయినప్పటికీ ఈ పాలసీపై అధికారులు ఇంకా ఎలాంటి చర్యలను ప్రారంభించ కపోవడం శోచనీయం. ఫిట్‌నెస్ పొందని వాహనాలు రోడ్డెక్కడం కారణంగా పొల్యూషన్‌తో పాటు ప్రమాదాలకు నిలయంగా మారే అవకాశం ఉంది. ఈ విషయంపై హైదరాబాద్ జేటీసీ రమేశ్‌ను వివరణ కోరగా స్క్రాప్ పాలసీకి సంబంధించి ఇంకా చర్యలు ప్రారంభించలేదని.. త్వరలో పాలసీ అమలుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.