తెలంగాణ ప్రజల గొంతుక బీఆర్‌ఎస్

22-04-2024 12:15:00 AM

పార్లమెంట్‌లో కొట్లాడింది మా పార్టీ ఎంపీలే..

నాడు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నోరు మెదపలేదు..

పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు

ఖమ్మం, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలను గొంతును పార్లమెంట్‌లో వినిపించిందని ఒక్క బీఆర్‌ఎస్ ఎంపీలేనని, నాడు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలునోరు మెదపలేదని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో ని తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లా డారు. ప్రజలు మరోసారి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించి, ఎన్నికల్లో గెలిపిస్తే రాష్ట్ర సమస్య లపై ఢిల్లీలో కొట్లాడతామన్నారు. బీఆర్‌ఎస్ అధినేత ఈనెల 29న ఖమ్మం రానున్నారని, ఆయన రోడ్ షోకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలన్నారు.

మర్నాడు కేసీఆర్ కొత్తగూడెంలో రోడ్ షో నిర్వహిస్తార న్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్  మాట్లాడుతూ.. నాడు తుమ్మల నాగేశ్వరరావుపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్ర లు చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఆరోపణలు నిజమని తేల్చి చూపించాలని సవాల్ విసిరారు. ఒకవేళ ఆరోపణలు నిజమైతే చట్టపరమైన ఏ చర్యకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

ప్రజలను పక్క దారి పట్టించేందుకే కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డా రు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు నారాయణఖేడ్ జిల్లాలో బీఆర్‌ఎస్ కార్యకర్తను హత్య చేశారని, ఇది దారణమైన చర్య అన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నదన్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు ఖాయమన్నారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పాల్గొన్నారు.