calender_icon.png 5 August, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ స్పీకర్ తీరుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన

05-08-2025 12:00:00 AM

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి: గంగుల కమలాకర్ 

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): సుప్రీం కోర్టు చెప్పిన విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరుతున్నామని మాజీ మంత్రి గం గుల కమలాకర్ అన్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్‌ను కలిసేందుకు సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు అసెంబ్లీకి వెళ్లగా,

ఆయన అందుబాటులో లేకపోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అక్కడ కొద్దిసేపు వారు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. స్పీకర్‌తో తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారని, తమ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారని చెప్పగా.. ఉదయం 11 గంటలకు సమయం ఇచ్చారని తెలిపారు. అయినా సభాపతి ఇంకా రాలేదని,

వారి కార్యాలయం వైపు వెళ్లే ద్వారం కూడా తెరవలేదని పేర్కొన్నారు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చామని గంగుల తెలిపారు. స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లినవారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, ముఠా గోపాల్ తదితరులున్నారు.