‘కొంగ జపం’ నేతలను నమ్మొద్దు!

26-04-2024 12:41:10 AM

ప్రలోభాలకు లొంగి మోసపోవద్దు..

స్వార్థపరుల కుటిల రాజకీయాలకు బలికావొద్దు..

బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 25  (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికలు వచ్చి నందున ఒంటి కాలుపై నిలబడి కొంగ జపం చేసే కొందరు నేతలు గ్రామాలకు వస్తారని, వారిని నమ్మి ఇతర పార్టీల్లో చేరితే మోసకపోక తప్పదని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు హెచ్చరించారు. ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి గురువారం నిర్వహించిన పార్టీ బూత్‌స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు ప్రలోభాలకు లొంగి, స్వార్థపరుల కుటిల రాజకీయాలకు బలికావొద్దని సూచించారు. బీఆర్‌ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదేళ్ల పాటు ప్రజల గొంతుకనవుతానన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసేందుకు మల్లాగుల్లాలు పడుతున్నదని విమర్శించారు. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, ఆ రోజు కాబట్టే సీఎం రేవంత్‌రెడ్డి ఆ తేదీని ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు గెలిస్తేనే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్ధి చెందుతుందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు మార్సుకోల సరస్వతి, బుర్స పోచయ్య, అబ్దుల్ కలాం, అలీబిన్ హైమద్, అజయ్, సౌందర్య, వెంకన్న, శ్రీధర్ పాల్గొన్నారు.