24-01-2026 03:12:09 PM
కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లోకి నెట్టిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది
గోదావరిఖని లో విలేకరుల సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆగ్రహం
గోదావరిఖని,(విజయక్రాంతి) సింగరేణి సంస్థను అధోగతి పాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని, కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లోకి నెట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 నుండి ఎంక్వైరీ కమిషన్ వేసి సింగరేణి సంస్థను దోచుకున్నది ఎవరో తేల్చుకుందామని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.
భూగర్భ గనులను పాతర పెట్టి రామగుండం ఊరు మధ్యలో ఉపరితల గనులను తెరిచి ఊరిని బొందల గడ్డగా మార్చారని ఆసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి కొత్త విద్యుత్తు పరిశ్రమలను తీసుకువస్తే జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు రేట్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థను విస్తృత పరుస్తున్న కాంగ్రెస్ నాయకులపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకే డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారన్నారి, తెలంగాణలో బీఆర్ఎస్ పతనం మొదలైందని, అసత్యపు ప్రచారాలను ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.