29-12-2025 03:24:05 PM
రైతు సమస్యల పరిష్కారానికి రాస్తారోకో
ఎల్లారెడ్డి,తాడ్వాయి,(విజయక్రాంతి): రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, పార్టీ నాయకులు రహదారిపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేయాలని, మొక్కజొన్న కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తాడ్వాయి మండలం లో పాడి పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న రైతులకు ప్రభుత్వం కోలుకోలేని దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. లీటరుకు రూ. 6 మేర ధర తగ్గించడంతో రైతులు పశువులను అమ్ముకుని,ఇతర ఉపాధి వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం పట్టిందని ధ్వజమెత్తారు. మక్కల కొనుగోలు కేంద్రాల్లో వేలిముద్రల విధానం వల్ల, సర్వర్లు సకాలంలో పనిచేయక, వేలిముద్రలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కపిల్ రెడ్డి ఆరోపించారు.
అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రుణమాఫీ డబ్బులను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం నాయకులు నేరుగా ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. రైతుల పక్షాన పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోపాల్ రావు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పులగం సాయి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ముధం నరసింహులు, బిఆర్ఎస్ పార్టీ నూతన సర్పంచులు,కార్యకర్తలు,రైతులు,తదితరులు పాల్గొన్నారు