25-04-2025 01:49:58 AM
భారీగా తరలిరావాలని శుభప్రద్ పటేల్ పిలుపు
వికారాబాద్, ఏప్రిల్-24వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరగబోయే బీఆర్‌ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ తెలిపారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు యావత్ రాష్ట్రం ఏకమవుతుందన్నారు. అన్ని దారులు ఎల్కతుర్తి వైపు అడుగేస్తున్నాయని, బండెనక బండి కట్టినట్టు అంతా సభా ప్రాంగణం వైపు కదం తొక్కుతున్నారని చెప్పారు.
బీఆర్‌ఎస్ 25 వసంతాల పండగలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏ ప్రకటన చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మార్పు పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఏమార్చి 16 నెలలు అవుతుందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆశ చూపి నయవంచనకు గురిచేసిందని, ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.
మహాలక్ష్మీ పథకం కింద రూ.500 గ్యాస్ సబ్సిడీ వేస్తామని మోసం చేసిందని,కేవలం రెండు, మూడు నెలలు మాత్రమే సబ్సిడీ వేసిందన్నారు.... ఆ తర్వాత రూ.50 మాత్రమే సబ్సిడీ వేస్తుంది. ఇదే విషయంపై ఇటీవల రేవంత్ సర్కార్ ప్రజాగ్రహనికి గురైంది. కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని ప్రజలు ఎండగట్టారు. రహదారిపైకి వచ్చి మరి తమ ఆగ్రహాన్ని వెల్లగక్కారు. రైతు భరోసా ఇవ్వలేదు.
రేపు, మాపు అని కాలం గడుపుతుందన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ అని ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించింది. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు వికారాబాద్ జిల్లా నుంచి భారీగా జనం తరలి రావాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శుభప్రద్ పటేల్ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడకను కదం తొక్కాలని ప్రజలను కోరారు.