19-11-2025 12:01:02 AM
కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పాయల్ కౌంటర్
ఆదిలాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నడు రైతులను పట్టించుకోలేదని, ఇప్పుడు అధికారం పోయాక రైతుల పక్షాన పోరాడుతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. ఆదిలాబాద్ పర్యటనలో కేటీఆర్, మాజీ మంత్రి జోగు రామన్న బీజేపీ ప్రభుత్వం పై, బీజేపీ ప్రజా ప్రతినిధులపై చేసిన అనుచిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రం గా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ...
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని, దీని కోసం వేల కోట్ల నిధులను వెచ్చించి సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేపట్టడం జరుగుతుందన్నారు. గత 12 ఏళ్లుగా సీసీఐ కొనసాగిస్తు వస్తున్న నిబంధనలే ఇప్పుడు కొనసాగుతున్నాయని, అందులో ఎలాంటి మార్పు లేదన్నారు. కేవలం రాజకీయం కోసం బీఆర్‌ఎస్ సీసీఐ కొత్త నిబంధనలను తీసుకువచ్చిందని అసత్య ప్రచారం చేస్తూ, రైతులను పక్కతో పట్టిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల నే రైతుల ముసుగులో మాట్లాడించి కేంద్ర ప్రభుత్వంపై, సీసీఐ సంస్థ పై తప్పుడు ప్రచా రం చేస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ కు రైతులపై అంతగా ప్రేమ ఉంటే కేంద్రం తీసుకువచ్చిన ఫసల్ బీమా యోజన పథకాన్ని గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయ లేదని ప్రశ్నించారు.
గతంలో ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన టెక్స్‌టైల్ పార్కు ఇతర జిల్లాకు మళ్లీపోతుంటే మంత్రి జోగు రామన్న అప్పు మాట్లాడలేదని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని ఆరోపించారు. కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు సిసిఐ సంస్థ సిఎండి, కేంద్ర మంత్రులతో పలుమార్లు కలవడం, మాట్లాడటం జరిగిందని గుర్తు చేశారు. ఈ మీడియ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.