calender_icon.png 19 November, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతులు దులుపుకున్న పార్టీలు అందని ద్రాక్షగా బీసీల కోటా!

19-11-2025 12:49:13 AM

మద్దతుకు ముందడుగు.. పరిష్కారానికి వెనుకడగు

హైదరాబాద్, నవంబర్ 18 (విజయ క్రాంతి) : తెలంగాణలోని బలహీనవర్గాల వారు ఇప్పుడు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రిజర్వేషన్ల విషయంలో దశాబ్దాల కల నెరవేరనుందని బీసీల్లో కాసేపు సంతోషం.. అంతలోనే సందిగ్ధం. బీసీలు ఎన్నో ఏళ్లుగా కొట్లాడుతున్న 42 శాతం రిజర్వేషన్ అంశం కొలిక్కి వచ్చిందని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ అనేక సమస్యలు చుట్టుముట్టాయి. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీసీలు కోటి ఆశలతో ఎదురుచూశారు.

కానీ, కోర్టుల రూపంలో ఎప్పటికప్పుడు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇక చేసేదేమీ లేక పోరుబాటే మార్గమని నిర్ణయించుకున్న బీసీ వర్గాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. బీసీలతోపాటు అన్ని సామాజికవర్గాలు స్వచ్ఛందంగా బీసీ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు తెలిపాయి. బంద్ విజయవంతమైంది. బీసీలు చేపట్టిన బంద్‌కు అటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ సహా అన్ని ఇతర పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాయి.

బంద్ విజయవంతమైంది. కానీ ఫలితమే శూన్యం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను ప్రతిపాదించాల్సిన కాంగ్రెస్, దానిని ఆమోదిం చాల్సిన బీజేపీ, పూర్తిస్థాయిలో మద్దతు తెలపాల్సిన బీఆర్‌ఎస్ సహా ఇతర ప్రతిపక్షాలన్నీ బంద్‌లో పాల్గొన్నాక బీసీలు చేసిన పోరాటం ఎవరిపైనా అనే అనుమానం రాక తప్పదు. ఇలాంటి పరిస్థితిలో యావత్తు బీసీ సామాజికవర్గంలో తీవ్ర సందిగ్ధత నెలకొన్నది. తాము చేసిన పోరాటం విజయం సాధించిందని చెప్పుకోవ డానికి లక్ష్యం దిశగా ఏం సాధించామనే పునరాలోచనలో ప్రస్తుతం బీసీలు ఉన్నా రు.

ఆయా పార్టీలు, పక్షాల నుంచి పొంది న మద్దతు, సహకారంతో తమకు ఏం లబ్ధి చేకూరిందని బీసీలు ప్రశ్నించుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి తమకు చేసిందేమీలేదని వారు భావిస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నిక ల్లో పార్టీపరంగానే బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో.. చట్టపరంగా రిజర్వేషన్ల అమలు జరగాలని ఇంతకాలం కొట్లాడిన బీసీలకు నిరాశే మిగిలింది. 

కాంగ్రెస్ హామీలు కాగితాలకే..

వాస్తవానికి బీసీల రిజర్వేషన్ అం శంలో కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రె స్ పార్టీ హామీ ఇచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పైనే ఎక్కువగా ఉంది. దీంతో బీసీల వర్గాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రమవుతున్నది. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కాంగ్రెస్ ప్రభు త్వం బుకాయిస్తున్నది. కులగణన అంశంలోనూ బీసీలకు అన్యాయం జరిగింది.

అయి నా 42 శాతం రిజర్వేషనే ముఖ్యం అనుకున్న బీసీలు ఆ అంశాన్ని పట్టించుకోలేదు. బీసీలకు రిజర్వేషన్ అమలు చేసేందుకు అసెం బ్లీలో బిల్లు చేశామని, గవర్నర్‌కు ఆర్డినెన్స్ పంపామని, ప్రత్యేక జీవో ఇచ్చామని, న్యా య పరమైన సవాళ్లు ఎదురైతే కోర్టుల్లో పోరాడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్నది. కానీ బీసీ రిజర్వేషన్ అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీసీ సమస్య కొనసాగాలనే కాంగ్రెస్ కోరుకుంటున్నదనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అమలైతే కాంగ్రెస్ పార్టీలోని బీసీలకు కూడా ప్రాధాన్యత గల పదవులు వస్తాయనే ఉద్దేశంతో వెనకడుగు వేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ఇప్పటివరకు న్యాయపరమైన చిక్కులపై అనేక సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్‌కు పరిష్కార మార్గమే కనిపించడం లేదా అనే ప్రశ్న లు ఎదురవుతున్నాయి. తప్పుడు సలహాలు ఇచ్చే లీగల్ టీమును తీసేసి మంచి న్యాయ నిపుణులను ఎందుకు నియమించుకోవడం లేదని బీసీలు ప్రశ్నిస్తున్నారు.  

చేతల్లో లేని బీజేపీ మద్దతు..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే అంశంలో కాంగ్రెస్ తీరు ఎలా ఉన్నా బీజేపీ అనుకుంటే బీసీలకు రిజర్వేషన్ అమలవుతుంది. కానీ బీజేపీ బీసీల అంశా న్ని రాజకీయంగా వాడుకుంటుందే తప్ప పరిష్కరించే దిశగా అడుగులు వేయడంలేదు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనను కాం గ్రెస్ ప్రభుత్వం శాస్త్రీయబద్ధంగా జరిపించలేదని బీజేపీ ఆరోపిస్తుంది. దీని కితోడు ఒక వైపు బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే ఆ ఘనత మొత్తం కాంగ్రెస్‌కు దక్కుతుందని, మరోవైపు బీసీ రిజర్వేషన్ అంశంలో ముస్లిముల అంశాన్ని దూర్చి దాటవేస్తుంది.

ఈ పరిణామాల మధ్య బీసీ బిల్లును ఆమోదించే అవ కాశం ఉన్నా ఆ దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగులు వేయలేదు. బీసీ రిజర్వేషన్ తాము సహకరిస్తామని చెబుతు న్నప్పటికీ, ఆ మద్దతు కేవలం మాటలకే పరిమితమవుతున్నది. ఈ అంశం లో బీజేపీ ప్రభుత్వం చేతల్లో చిత్తశుద్ధి చూపడం లేదు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నెపం నెట్టి బీజేపీ తప్పించుకుంటుంది. దీంతోపాటు బీసీల 42 శాతం జాబితా నుంచి ముస్లింలను తొలగిస్తే ఈ బిల్లు ఆమోదిస్తామని ప్రకటించడంతో బీజేపీ తీరు స్పష్టమ వుతున్నది. తెలంగాణ బీజేపీ ఎంపీలు అం దరూ రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  

బీఆర్‌ఎస్ ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ.?

బీసీ రిజర్వేషన్ అమలులో బీఆర్‌ఎస్ పాత్ర ఎంతో కీలకం. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో దాదాపు 14 ఏళ్లు అలుపెరగని ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఘన చరిత్ర బీ(టీ)ఆర్‌ఎస్ పార్టీకి ఉంది. అ యితే బీసీలకు రిజర్వేషన్ హామీతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకుని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న కాంగ్రెస్, సహకరించాల్సిన బీజేపీ దాటవేత ధోరణిని అవలంభిస్తున్నాయి.

దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యత మోపుతూ బీఆర్‌ఎస్ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఈ నేపథ్యం లో బీఆర్‌ఎస్ మరోసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని బీసీల కోసం రగిలించాల్సిన అవసరం ఎంతో ఉంది. బీసీలు పిలుపు ఇచ్చిన ప్రతిసారీ బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటిస్తుంది. కానీ బీసీ రిజర్వేషన్ సాకారం దిశగా పోరాటం చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్‌లో అన్ని పార్టీలకు ఉన్న ఎంపీల రాజీనామాలు డి మాండ్ చేస్తూ ప్రజల్లో చైతన్యం రగిలిస్తే బీసీ రిజర్వేషన్ ఉద్యమం కూడా ఉవ్వెత్తున ఎగసి, పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.

మరి పరిష్కారం ఎలా.? 

ప్రస్తుతం తెలంగాణలోని బీసీ లు దిక్కుతోచని దీనస్థితిలో ఉన్నా రు. బీసీల సమస్యపై పోరాటం చేస్తే అందరూ మద్దతు ఇస్తున్నారు. కానీ ఎవరూ సమస్యను పరిష్కరించడం లేదు. అయితే అన్ని పార్టీల చేతుల్లో మోసపోయినట్టు బీసీలు భావిస్తున్నారు. ప్రతి పార్టీకి బీసీల ఓట్టు కా వాలి. కానీ బీసీ రిజర్వేషన్ అమ లు చేయడం మాత్రం ఏ పార్టీకి, ప్ర భుత్వానికి ఇష్టం లేదు.

ఆయా పార్టీ లు, ప్రభుత్వాల విషయం పక్కనబెడితే బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉన్నా రు. కానీ వారంతా వారి వారి పార్టీ ల ఆదేశాలే పాటిస్తున్నారు. ఉమ్మడిగా బీసీ సమాజం సామాజిక, ఆర్థి క, రాజకీయ పరంగా వృద్ధి వచ్చేందుకు కృషి చేయడం లేదు. పార్టీల అధిష్ఠానాలను సంతోషపరడమే ల క్ష్యంగా బీసీ నాయకులు పనిచేస్తున్నారు. 42శాతం రిజర్వేషన్ సాధన పోరాటంలో నామమాత్ర పోరాటానికే పరిమితమవుతున్నారు.