19-11-2025 01:01:10 AM
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి) : కోటి మంది మహిళలకు చీరలను అందించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అరులైన ప్రతీ మహిళకు ఇంది రమ్మ చీరను అందించాలని అధికారులకు సూచించారు. బుధవారం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు.
చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారని, ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందిరా గాంధీ జయంతి నుం చి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
రెండవ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చీరల నాణ్యత విషయంలో రాజీప డొద్దని, మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సాంకేతికను వినియోగించుకుని ఇం దిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరం తరం పర్యవేక్షించాలని సూచించారు.
బుధవారం ఇందిరా గాంధీ జయంతి సందర్భం గా మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడుతారు.
రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి వీడీయో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క, సీఎం సెక్రెటరీ మాణిక్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, సెర్ప్ సీఈవో డి.దివ్య, పాల్గొన్నారు.
ఇందిరమ్మ చీరల పంపిణి ఒక చరిత్రాత్మక ఘట్టం : మంత్రి సీతక్క
కోటి మంది మహిళలకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశం అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ చీరల పంపిణీ ఒక చరిత్రాత్మక ఘట్టమన్నారు. అర్హులైన ప్రతి మహిళలకు ఇందిరమ్మ చీర అందించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పం, వారి జీవితంలో ఆనందం పంచాలన్న ప్రభుత్వ ధ్యేయానికి నిదర్శనమన్నారు. ఇందిరమ్మ చీరలను స్వీకరిం చేందుకు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
శాసన మండలి భవనం పునరుద్ధరణ పనుల పరిశీలన
అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి భవనం పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. మంగళ వారం అసెంబ్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్రం ప్రసాద్‌కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు మండలి భవనం పనులను పరిశీలన చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల వరకు భవనం పునరుద్ధరణ పనులు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా అసెంబ్లీ ఆవరణలో పార్లమెంట్ తరహాలు సెంట్రల్ హాల్‌ను ఏర్పా టు చేయాలని సూచించారు.
ఇందిరమ్మ పాలనే మాకు ఆదర్శం
దేశ ప్రగతి, పేదల అభ్యున్నతికి ఇందిరాగాంధీ తన ప్రాణాలను అర్పించిన మహానీ యురాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధాని ఇంది రాగాంధీ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి ఆమెను స్మరించుకున్నారు. తన ప్రాణా లకు ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ దేశ సమగ్రత, సమైక్యత, పటిష్టత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుని ఆమె ముందుకు సాగారని సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలలనను ఆదర్శంగా తీసుకుని ఆమె పేరిట అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.