01-10-2025 01:50:33 AM
చిన్న విషయమై తలెత్తిన వివాదం
మణికొండ, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి ): మద్యం మత్తులో స్నేహితుల మధ్య చెలరేగిన ఓ చిన్న వివాదం హత్యకు దారి తీసింది. ఇద్దరు స్నేహితులు కలిసి మరో స్నేహితుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
కోకాపేటలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో యాదగిరి, ఆఫ్రోజ్, నవాజ్ అనే ముగ్గురు స్నేహితులు సోమవారం రాత్రి కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో వారి మధ్య ఓ చిన్న విషయమై మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది.ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆఫ్రోజ్, నవాజ్ కలిసి యాదగిరిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. యాదగిరి గట్టిగా కేకలు వేయడంతో, శబ్దం విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికే యాదగిరి తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన ఆఫ్రోజ్, నవాజ్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి వెల్లడించారు.