01-10-2025 01:53:21 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): మహిళల ప్రపంచకప్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఆటను 47 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా.. ఎనిమిది వికెట్లు నష్టపోయి 269 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం శ్రీలంకకు 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 45.4 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది.
చమరి ఆటపట్టు (43; 47 బంతుల్లో) టాప్ స్కోరర్. నీలాక్షి డి సిల్వా (35), హర్షిత సమరవిక్రమ (29), కులసూర్య (17), కవిష (15), ఉదేశిక ప్రభోదిని (15), హసిని పెరీరా (14), విష్మి గుణరత్నె (11), సుగంధిక కుమారి (10) పరుగులు చేశారు. బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత స్పిన్నర్ దీప్తి శర్మ (3/54) బంతితోనూ మెరిసింది. స్నేహ్ రాణా 2, శ్రీ చరణి 2, క్రాంతి గౌడ్, అమనోజ్యోత్, ప్రతీకా రావల్ తల ఒక్కో వికెట్ పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఒక దశలో 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అమనోజ్యోత్ కౌర్ (57; 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (53; 53 బంతుల్లో 3 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. ఈ జోడీ ఏడో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
హర్లీన్ డియోల్ (48, 64 బంతుల్లో 6 ఫోర్లు), ప్రతీకా రావల్ (37, 59 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హర్మన్ ప్రీత్‌కౌర్ (21) కే అవుటయింది. చివరగా వచ్చిన స్నేహ్ రాణా (28, 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) దూకుడుగా ఆడింది. స్మృతి మంధాన (8), జెమీమా రోడ్రిగ్స్ (0), రిచా ఘోష్ (2) నిరాశపర్చారు. శ్రీలంక బౌలర్లలో ఇక రణవీర (4/46) రాణించింది. ఉదేశిక ప్రబోధని 2, చమరి ఆటపట్టు, కులసూర్య ఒక్కో వికెట్ తీశారు.