01-08-2025 12:16:41 AM
నాగారం: మా పస్తాల గ్రామానికి రోడ్డు వేయండి సారు, అంటూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం పస్తాల గ్రామంలో ప్రజానీకం, నేటి యువత బ్యానర్లు కట్టి సాక్షాత్తు సీఎం,జిల్లా మంత్రి,కలెక్టర్, ఎమ్మెల్యేలను ప్రాధేయ పడుతోంది.పస్తాల గ్రామానికి వెళ్ళే ప్రధాన రోడ్డు దారుణంగా ఉందని ప్రజానీకం బ్యానర్ లో పేర్కొంది. అంతేకాకుండా ప్రమాదాలుజరుగుతున్నాయని, బస్సు సౌకర్యం కరువైందని,వర్షాకాలం వస్తే ఊరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని బ్యానర్లు తెలుపుతూ విద్యార్థులు, రైతులు, మహిళలు, ప్రజానీకమంతా ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు.
ఇది ఇలా ఉంటే రోడ్డు వేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా బహిష్కరిస్తామంటూ ఇటీవలే గ్రామస్తులు అంబేద్కర్ విగ్రహం ముందు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ముఖ్యంగా నాగారం~తుంగతుర్తి ప్రధాన రహదారి ఆర్ అండ్ బి నుండి పస్తాల~గుండెపురి రహదారి గత కొన్నేళ్ల నుండి శిథిలమై అధ్వానంగా మారింది. కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడింది.ఈ పరిణామాలతో గ్రామ మీదుగా హైదరాబాద్ కు నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా రద్దయ్యాయి.