calender_icon.png 1 November, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో రెండవ రోజు కొనసాగిన కూల్చివేతలు

01-11-2025 03:41:49 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రెండవ రోజైన శనివారం మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు చేపట్టారు. ప్రధానంగా రద్దీగా ఉండే మార్కెట్ ఏరియాలోని కాంటా అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇరువైపులా రోడ్డు విస్తరణ పనులను పెద్ద ఎత్తున చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న షెడ్లతోపాటు చిన్నపాటి నిర్మాణాలను జెసిబిల సహాయంతో తొలగించారు. మున్సిపల్ అధికారుల చర్యల వల్ల ఒక్కసారిగా చిన్నపాటి వ్యాపారులు రోడ్డున పడ్డారు. చిరు వ్యాపారులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇయ్యకుండానే పనులు ప్రారంభించడం పట్ల వ్యాపారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కాంట అంబేద్కర్ చౌరస్తా వద్ద గల నూతన కూరగాయల భవన సముదాయం ఎదుట గల కోళ్ల వ్యాపారస్తులు నిర్మించుకున్న షెడ్లను అక్కడికక్కడే తొలగించడంతో వారంతా సామాగ్రితో రోడ్డున పడ్డారు.

వ్యాపారస్తుల ధర్నా, ఆందోళన

బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో కూల్చివేతలను నిరసిస్తూ వ్యాపారులు రోడ్డు మధ్యలో కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఒక్కసారిగా తమ దుకాణాలను నేల మట్టం చేయడం వల్ల తమకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా మెయిన్ బజార్ ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని, 100 ఫీట్ల రోడ్డు విస్తరణ వల్ల తమ ఉపాధిని పూర్తిగా కోల్పోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి కొలతలు లేకుండా పూర్తిస్థాయిలో జెసిబి లతో దుకాణాలను కూల్చివేసి తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కూల్చివేతలు ఆపాలని హై కోర్టు ను ఆశ్రయించినట్లు చిరు వ్యాపారులు తెలిపారు. తమకు జీవనోపాధి చూపి కూల్చివేతలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను వేడుకున్నారు. కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కూల్చివేతల సమయం లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహమ్మద్ గౌస్ , అతని కుమారుడు తమ దుకాణం కూల్చివేత తో జీవనోపాధి కోల్పోయామని ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. పోలీసులు వారిని సముదాయించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బెల్లంపల్లి ఏసీపి ఏ.రవికుమార్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి కూల్చివేతలు కొనసాగించారు.