కాంగ్రెస్‌లో చేరిన బుక్క మోహన్ బాబు
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు
మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి) : తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన స్వరాష్ట్ర ఉద్యమకారుడు బుక్క మోహన్ బాబు(Bukka Mohan Babu) ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలో బుక్క మోహన్ బాబుతో కలిసి నడిచిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్యమాన్ని బలపరిచే క్రమంలో ఆయన చేసిన కృషి విశేషమని కొనియాడారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉద్యమకారులు కాంగ్రెస్ వైపు రావడం ప్రజల్లో మారుతున్న నమ్మకానికి నిదర్శనమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మహబూబ్ నగర్ జిల్లాకు భారీగా నిధులు సమీకరించి, అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యమని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి చేరిన మోహన్ బాబు వంటి ఉద్యమకారుల అనుభవం, ప్రజాదరణ పార్టీకి బలం చేకూరుస్తుందని, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఇది కీలక మలుపు అవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మోహన్ బాబు కు పార్టీ పరంగా పూర్తి స్థాయి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే(MLA Yennam Srinivas Reddy) హామీ ఇచ్చారు. అనంతరం మోహన్ బాబు మాట్లాడారు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమ ఆశయాలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని విమర్శించారు. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు తగిన గుర్తింపు, న్యాయం అందలేదని స్పష్టం చేశారు.
నాడు తెలంగాణ సాధన కోసం పోరాడిన నాయకులు, కార్యకర్తల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు. అందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీనే సరైన వేదికగా ఆయన అభివర్ణించారు. మహబూబ్ నగర్ అభివృద్ధి(Mahabubnagar Development), అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల సాధన లక్ష్యంగా పనిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, పాలమూరు విశ్వవిద్యాలయం వంటి కీలక అంశాల్లో నాడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఉద్యమించిన విషయాన్ని గుర్తుచేసిన మోహన్ బాబు, ఆ సమయంలో ఉన్న ఆశయాలు ఇప్పటికీ ఆశలుగానే ఉన్నాయని, వాటి సాధన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






