6 May, 2026 | 12:32 PM

ధాన్యాన్ని కాపాడుకోవడానికి వెళ్లి కానరాని లోకాలకు...

06-05-2026 12:01 PM

లక్షెట్టిపేట మండలంలో గోడ కూలి నలుగురి మృతి

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్షెట్టిపేట మండలంలో( Lakshettipet Mandal) గోడకూలి నలుగురు మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి నెలకొంది. పండించిన వరి ధాన్యం వర్షం పాలు కావద్దని కాపాడుకోవడానికి వెళ్లిన రైతుల పాలిట రక్షణను ఇచ్చే షెడ్డు వారి ప్రాణాలను హరించిన సంఘటనలు మండలంలో విషాదాన్ని నింపాయి... వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లాలో మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్లు కప్పేందుకు వెళ్లిన లక్షెట్టిపేట మండలం కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లిన రైతుల కుటుంబాల్లో విషాదం నింపింది.

 ధాన్యాన్ని కాపాడుకోవడానికి వెళ్లి కానరాని లోకాలకు...

లక్ష్టెట్టిపేట మండలంలో వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు వెళ్లిన రైతులు కుప్పలపై కవర్లు కప్పే ప్రయత్నం చేస్తుండగా గాలి బీభత్సం, వర్షం నుంచి తలదాచుకునేందుకు గంపలపల్లి, కొత్తూరు గ్రామాల రైతులు(Kotturu Villages Farmers) షెడ్ లలోకి వెళ్లారు. గోడలు కూలడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరొక రైతు మృతి చెందారు. ఈ ఘటనతో కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న లక్షెట్టిపేట పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తండ్రి, కొడుకులు మృతి...

గోడ కూలి రైతులు మరణించిన సంఘటనలో మండలంలోని గంపలపల్లి గ్రామానికి చెందిన తండ్రి, కొడుకులు మృతి చెందారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలపై కవర్లు కప్పేందుకు తనుగుల నాగరాజు కొడుకు తనుగుల అభిరాంతో వెళ్లగా వర్షం ఎక్కువవడంతో పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి వెళ్లగా గాలి దాటికి షెడ్డు కూలి తనుగుల అభిరాం(22) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన నాగరాజు (50) మెరుగైన వైద్యం నిమిత్తం కరీంనగర్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.

కొత్తూరు కొనుగోలు కేంద్రంలో(Kothuru Procurement Center) ధాన్యాన్ని కాపాడుకునేందుకు వెళ్లిన గుండారపు వెంకటేష్ (24)తో మరో ఐదుగురు రైతులు షెడ్డులో తలదాచుకోగా ఒక్కసారిగా గోడ కూలడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నెల్కి లచ్చన్న (55) తన కుమారుడిని హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు లక్షెట్టిపేట వెళ్లి తిరిగి వస్తుండగా వర్షం ఎక్కువ కావడంతో షెడ్డులో కొంత మంది ఉండటాన్ని గమనించి అందులోకి వెళ్లిన లచ్చన్న సైతం గోడ కూలడంతో మృతి చెందాడు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. రక్షణ కోసం వెళ్తే ప్రాణాలు పోయాయంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

రైతుల మృతి విషాదకరం... మంచిర్యాల ఎంఎల్ఏ ప్రేం సాగర్ రావు

మంచిర్యాల నియోజక వర్గంలోని లక్షెట్టిపేట మండలంలో మంగళవారం రాత్రి గోడ కూలి నలుగురు రైతులు మృత్యువాత పడిన ఘటన విషాదకరమని మంచిర్యాల ఎంఎల్ఏ ప్రేం సాగర్ రావు(Mancherial MLA Prem Sagar Rao) పేర్కొన్నారు. ప్రమాదంలో చనిపోయిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కోక్కరికి నా తరుపున రెండు లక్షల తక్షణ సాయం అందిస్తున్నానని, క్షతగాత్రులకు ప్రభుత్వం తరుపున మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రభుత్వం తరుపున బాదిత రైతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.