12-07-2025 12:00:00 AM
కపిల్ శర్మ.. మన దేశంలో ప్రజాదరణ పొందిన కమేడియన్లలో ఒకరు. టీవీలో ‘కపిల్ శర్మ షో’ ద్వారా ఆయన పాపులారిటీ పొందారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా, సర్రేలో ఇటీవల ఆయన సొంతంగా ఏర్పాటు చేసిన ‘కాప్స్ కెఫే’పై బుధవారం రాత్రి దుండగులు కాల్పులు జరిపారు. కెనడాలోని భారతీయులను ఈ ఘటన కలవరపాటుకు గురిచేసింది. ఈ కాల్పుల్లో అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు.
కెఫే అద్దాలకు బుల్లెట్ రంధ్రాలు పడ్డాయి. కాల్పులు జరిపింది తన అనుచరులేనని ఖలిస్తాన్ ఉగ్రవాది హర్జీత్ సిగ్ లడ్డీ ప్రకటించుకున్నాడు. మన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో లడ్డీ కూడా ఉన్నాడు. ఇప్పటికే నిషేధిత సంస్థగా ఉన్న బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)లో లడ్డీ పనిచేస్తున్నాడు. లడ్డీ అనుచరులు తుపాకులతో జరిపిన కాల్పుల్లో కెఫే అద్దాలపై 12 బుల్లెట్ జాడలున్నాయి.
గతంలో కపిల్ శర్మ తన టీవీ షోలో నిహంగ్ సిక్కుల సంప్రదాయ వస్త్రధారణ, వారి నడవడికపై హాస్యంగా చేసిన వ్యాఖ్యలు తమను నొప్పించా యని, అందుకే ఈ దాడి చేశామని లడ్డీ ప్రకటించాడు. తను, బీకేఐలో పనిచేస్తున్న మరో ఉగ్రవాది తూఫాన్ సింగ్ కలసి ఈ దాడికి ప్లాన్ వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో లడ్డీ రాసుకొచ్చాడు. బీకేఐని కెనడా ప్రభుత్వం కూడా ఉగ్రవాద సంస్థగానే గుర్తించింది.
పంజాబ్‌కు చెందిన లడ్డీ గత ఏడాది విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకులను టార్గెట్ చేసుకుని, వీహెచ్‌పీ నాయకుడు వికాస్ ప్రభాకర్‌ను హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన తర్వాత ఎన్‌ఐఏ లడ్డీ ఆచూకీ కోసం 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. లడ్డీ సంబంధాలు పెట్టుకున్న బీకేఐ కెనడాలోనే కాకుండా ఇంగ్లండ్‌లో కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ అని ఎన్‌ఐఏ పేర్కొంది.
ఉగ్రవాద గ్రూప్‌లకు ఆశ్రయం కల్పిస్తున్న కెనడా, అక్కడి నుంచి భారత్‌లో వేర్పాటువాద కార్యకలాపాలకు ఊతమిస్తున్నదని భారత ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. సిక్కు వేర్పాటు నాయకుడు హర్దీప్‌సింగ్ నిజ్జార్‌ను కెనడాలో గుర్తుతెలియని దుండగులు హత్య చేసిన తర్వాత గత ఏడాది కెనడా, భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
సిక్కు వేర్పాటువాద నాయకునిగా, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) చీఫ్‌గా పనిచేసిన నిజ్జార్‌కు, భారత దేశంలో నాలుగు కేసులతో ఆయన ప్రమేయం ఉందని ఎన్‌ఐఏ ‘వాంటెడ్’ లిస్ట్‌లో చేర్చింది. నిజ్జార్ హత్యతో భారత్‌కు సంబంధం ఉందని కెనడాలోని సిక్కు వేర్పాటు సంస్థ లు, నాయకులు బాహాటంగానే ఆరోపించారు. దానిని భారత్ ఖండించింది. కెనడా మాజీ ప్రధాని ట్రూడో కూడా వారికి వంతపాడి, భారత్‌లో దౌత్య సంబంధాలను తెంచుకున్నారు.
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నె వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. గత నెలలో కెనడా సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సర్వీసు ఒక నివేదిక ఇచ్చింది. నిజ్జార్ హత్యతో భారత ప్రభుత్వానికి సంబంధముందనే ఆరోపణలు కొట్టివేస్తూ, కెనడాలోని ఖలిస్థాన్ ఉగ్రవాదులు భారత్‌లో హింసాత్మక చర్యలకు పథకాలు రచిస్తూ, తగిన నిధులు అందిస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది.
భారత్ వాదనకు కెనడా మొదటిసారిగా ఇలా ఏకీభావం తెలిపింది. కొన్ని మిలిటెంట్ గ్రూప్‌లు తమ గడ్డపై సాగిస్తున్న హింసాత్మక కార్యక్రమాలు కెనడా భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆ నివేదిక పేర్కొంది.