calender_icon.png 21 July, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయాగరా సందర్శనం

12-07-2025 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

‘నయాగరా’ జలపాతాన్ని చూ స్తున్నంత సేపు పిల్లల్నీ, పెద్దల్నీ ఎక్కువగా అలరించేవి ఆకాశంలోని ఇంద్ర ధనుస్సులే. ప్రియురాలి కొప్పులో తురిమినట్లు ఆకాశమనే ప్రియుడు జలపాతమనే ప్రియురాలిని ఇంద్ర ధనస్సుతో అలంకరించాడనిపించింది. నయాగరా జలపాతాన్ని చూస్తున్నంతసేపు కండ్లు మూయలేం. మరలా, మరలా చూసే కళ్లు, మరలి మరలి చూసే సందర్శకులు కోకొల్లలు! 

ప్రపంచంలో కొందరు తమ జీవిత కాలంలో అమెరికా వెళ్లి నయాగరా జలపాతాన్ని చూడాలనుకుంటారు. దక్షిణాఫ్రికాలోని ‘విక్టోరియా’ జల పాతం ప్రపంచంలో అన్ని జలపాతాల కంటే గొప్పది. అమెరికా కెనడాల మధ్య గల నయాగరా జలపాతం కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. నయాగరా చరిత్ర పన్నె డు వేల ఐదువందల సంవత్సరాల నాటి ది. ‘నయాగరా’ అనే పేరు గల అమ్మాయి గాథకు మన ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ కథకు పోలికలు న్నవి.

నయాగరాను ఆమె తల్లిదండ్రులు కూతురి అంగీకారం లేకుండానే ఒక ముసలి మొగుడికిచ్చి పెళ్లి చేస్తారు. నయాగరా వివాహ వేదిక నుంచి ఎకాకిగా బయల్దేరి, తోటి అమ్మాయిలకు ‘గుడ్ బై’ చెబుతూ వెదురువనం గుండా ప్రయాణించి పడవెక్కివెళ్లిపోతుంది. సు మారు 175 మీటర్ల పైనుంచి దూకే జలపాతంలో కలసిపోతుంది. 

“వేరులేక జలపాతం

పై దవడ పోయెనంట

అందులో నయాగరా 

పదుటనె పేరొచ్చెనంట”

ఆమె మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. నయాగరా జలపాత దృశ్యాలను కెనడా వైపు నుంచి చూస్తే బాగా కనిపిస్తాయట. నేను నా బావమరిది జగదీశ్, చిన్న కుమారుడు ప్రణవ్‌తో కలిసి అమెరికా దిక్కు నుంచే జలపాతాన్ని చూశాం. ‘మేడ్ ఆఫ్ ది మిస్ట్‘ అనే పేరు గల పడవెక్కి మేం జలపాతం సమీపానికి వెళ్లాను. నీరంతా పైనుంచి దూకడం వల్ల ఏర్పడ్డ నురుగు పాలసముద్రాన్ని తలపించింది.

నీటి దూకుడుకు వినిపించే శబ్దం యుద్ధభేరీ నినాదాన్ని తలదన్నేలా ఉంది. జలపాతం అడుగు సమీపించినప్పుడు నాకొక అద్భు త జల ప్రపంచంలో ఉన్న అనుభూతి కలిగింది. అక్కడి నుంచి బయటపడిన నాకు ప్రళయం నుంచి బయటపడినట్టనిపించింది. నయాగరా సందర్శనం అయిన తర్వాత ‘నయాగరా లెజెండ్స్ ఆఫ్ అడ్వెంచర్ థియేటర్’లోకి ప్రవేశించాను.

అందు లో ‘నయాగరా’ చరిత్రతో పాటు, ఆ జలపాతంలో దూకి సాహసకృత్యాలు ప్రద ర్శించిన వీరుల వివరాలు, దృశ్యాలన్నీ ఉన్నాయి. ‘నయాగరా’ జలపాతాన్ని చూ స్తున్నంత సేపు పిల్లల్నీ, పెద్దల్నీ ఎక్కువగా అలరించేవి ఆకాశంలోని ఇంద్ర ధనుస్సులే. ప్రియురాలి కొప్పులో తురిమినట్లు ఆకాశమనే ప్రియుడు జలపాతమనే ప్రి యురాలిని ఇంద్ర ధనస్సుతో అలంకరించాడనిపించింది.

నయాగరా జలపాతాన్ని చూస్తున్నంతసేపు కండ్లు మూయలేం. మరలా, మరలా చూసే కళ్లు, మరలి మరలి చూసే సందర్శకులు కోకొల్లలు! ఆకాశ గంగలో విహరించే వారిని దేవతలు అంటారు. అక్కడ మనం కూడా కంటిరెప్పలాడించని దేవతామూర్తులమవుతాం.

రెయిన్‌బో బ్రిడ్జి చూడాల్సిందే..

అమెరికా, కెనడాను కలిపే రెయిన్ బో బ్రిడ్జిని చూడాల్సిందే. ఈ బ్రిడ్జి ‘నయాగరా’ జలపాతం సమీపంలోనే ఉంటుంది. అది ధనుస్సు ఆకారంలో ఉంటుంది. నయాగరా జలపాతాన్ని చూస్తుంటే శివుని తలమీది నుంచి దూకే గంగ స్ఫురిస్తుంది. అయితే మన గంగకు ప్రవాహం లో వేగమెక్కువ, నయాగరాకు దూకడంలో వేగమెక్కువ అందుకే నేను నయా గరాను మన గంగమ్మకు చెల్లెలుగా భావించాను. 

“నిజముగా గంగమ్మ తల్లికి

చెల్లివని నిన్నెంచుకుంటిని

అక్క కంటెను చెల్లెకెక్కువ

దూకుడుందని తలచుచుండెని”

మంచు కురిసే కాలంలో జలపాతం ఏర్పడ్డ చోట శివలింగాలు, విబూదిపూలు సాక్షాత్కరిస్తాయి. సాయంత్రపు సూర్యకాంతిలో పడుతున్న జలధారలు శివున్ని అభిషేకించడానికి ఉబలాటపడుతున్నాయనిపించింది. మరొక విధంగా చెప్పాలంటే శివుని జటాజూటం నుంచి కిందికి పడుకున్నట్లుగా జడల ధారలుండగా, ఉద్భ వించిన ధ్వనులు శివుని చేతి ఢమరుకం నుంచి వెలువడిన ధ్వనులను తలపించాయి.

‘నయాగరా’ ప్రకృతి ప్రేమికులకు గొప్ప దృశ్యం. జలధారలను ప్రేమించే వారికిది గొప్ప విడిది గృహం. భూమిమీద అద్భుతాలేమున్నవి? అన్నవారికి ‘నయాగరా’ ఒక చక్కని సమాధానం. అది మహా ద్భుతం! సృష్టి వైచిత్రి! పరమశివుని లీల! ప్రకృతి ప్రసాదించిన వరం! చలికాలంలో జలపాత సందర్శనం ఉండదు. మంచుతో వంతెన లేర్పడగా, వీటిపై నడిచే వాళ్లున్నారు.

మంచు పరుపులు, మంచు మెత్త లు, మంచు విసన కర్రలు, మంచుపూలు, మంచు కమండలాలు మొదలైన వాటిని గమనిస్తే ప్రకృతి దేవతకిది విశ్రాంతి మందిరమేమో అనిపిస్తుంది! నేను నయాగ రాను చూడక ముందు అది గుట్ట మీది నుంచి దొర్లుతుందని భావించాను. విద్యుద్దీపాల కాంతిలో నయాగరా ఒక కాంతి ప్రవాహంలాగా చూపరులకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. 

‘నయాగరా’ తీరంలో ఒక బోర్డుంది. దానిమీద నయాగరా ఆకారం గుర్రపుగిట్టలా ఉందని రాసి ఉంది. ఇక జలధారల అందాన్ని చూసినప్పుడు మనకు బనారస్ పట్టు చీరలు గుర్తుకు వచ్చాయి. అంతేకాదు ‘ఏ గద్వాలలో/పోచంపల్లిలో నేసిన ధరలు/నీకర్పించిందో’ అన్న భావన మన కు కలుగుతుంది. ‘నయాగరా’లో రెండు రోజులున్నాను. నాలుగుసార్లు జలపాత దర్శనం కలిగింది.

ఉధృతంగా నా కలం నుంచి ‘నయాగరా’ అనే గేయ కావ్యం అవతరించింది. నిజానికి ఈ గేయ కావ్యం రాయాలన్న తలంపు మన తెలుగు మహాకవుల వల్లనే కలిగిందని చెప్పగలను. మహాకవులైన శ్రీవిశ్వనాథ సత్యనారాయణ గారి ‘కిన్నెరసాని పాటలు’, సీ నారాయణరెడ్డి ‘నాగార్జున సాగరం’, పుట్టపర్తి నారాయుగాచార్యుల వారి ‘శివ తాండవం’ విశ్వవిద్యాలయ స్నాతకోత్తర విద్యార్థులకు బహునాళ్ల పాఠం చెప్పడం వల్ల కలిగిన సంస్కారమే కావ్యావతరణకు ప్రేరణ.

ఆ రాష్ట్ర సారస్వత పరిషత్ వేదిక మీద 1971 ప్రాంతంలో ‘సరస్వతీ పుత్ర’ పుట్టపర్తివారు శివ తాండవాన్ని వినిపిస్తుంటే, స్వయంగా చూశాను. ఒక విధంగా అలాగే ఒక కావ్యాన్ని రాయాలని మనసులో అనుకున్నాను. అది ‘నయాగరా’ను చూసినప్పుడు అక్షర రూపం ధరించడం విశేషం. కవుల అనుభావాలు వట్టిగా ఉండిపోవు గదా !