calender_icon.png 22 July, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు టీచర్ల సమస్యలను పరిష్కరించాలి

12-07-2025 12:00:00 AM

తెలంగాణలో దాదాపు 15,360 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వాటి పరిధిలో 1,40,000 మంది విద్యార్థులు, 41,360 మంది ఉపాధ్యాయులు ఉన్నట్టు ఓ అంచనా. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తక్కువ జీతాలతో, బడిలో చదివే పిల్లల తల్లిదండ్రుల అధిక అంచనాలతో సతమతం అవుతున్నారు. వీరికి ఉద్యోగ భద్రత అనేది వట్టి మాట. వారు తీవ్రమైన పనిభారం, వేగంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు.

ప్రైవేట్ పాఠశాలల్లో కఠినమైన విద్యా ప్రమాణాలు అవలంభిస్తూ, యాజమాన్యాలు ఉపాధ్యాయులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఉపాధ్యాయులు తరగతుల్లో పాఠాలు చెప్పడం మాత్రమే కాకుండా కంప్యూటర్ ల్యాబ్స్, ఫీజులు వసూలు చేయడం వంటి పనులు కూడా చేయాల్సి వస్తున్నది. పరీక్షల్లో విద్యార్థులకు మార్కులు తక్కువ వస్తే బలిపశువులుగా మారేది ఈ ఉపాధ్యాయులే.

తల్లిదండ్రులు, పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం, సాయంత్రం వేళ్లలో, సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల ఉపాధ్యాయులు తమ కుటుంబాలకు దూరం అవుతున్నారు. తక్కువ వేతనం పొందుతూ దుర్భర జీవితాలు గడుపుతున్నారు. కాంట్రాక్ట్ పద్ధతి పుణ్యమా.. అని వారికి ఉద్యోగ భద్రత అన్నది కలగా మారింది. పీఎఫ్, గ్రాట్యూటీ, వైద్య బీమా లాంటి సౌకర్యాలు లేకుండా ఎలాంటి సామాజిక, ఆర్థిక, ఆరోగ్య భద్రత లేకుండా జీవిస్తున్నారు.

తరగతుల్లో ఎక్కువ సేపు బోధించడం వల్ల వీరు గొంతు ఇన్ఫెక్షన్ల బారినపడుతున్నారు. యాజమా న్యాలు వీరిని శ్రమ దోపిడీ చేస్తున్నాయి. ఉపాధ్యాయులు ఎక్కువసేపు నిలబడటం వల్ల వెన్నునొప్పి, మోకాలి నొప్పుల సమస్యలతో సతమతమవుతున్నారు. ఎక్కువ పని ఒత్తిడి వల్ల ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాలు అమానవీయంగా ఉన్నాయి.

ప్రభుత్వ విద్యా అధికారులు ప్రైవేట్ పాఠశాలను తనిఖీ చేసినప్పుడు కేవలం విద్యార్థుల సంఖ్య, రిజిస్ట్రేషన్ పేపర్లు మాత్రమే చూస్తున్నారు. అధికారులు ఉపాధ్యాయుల జీతభత్యాలు, వారి ఉద్యోగ భద్రతల గురించి చర్చించట్లేదు. కార్పొరేట్ పాఠశాలల వాణిజ్య ప్రకటనలతో మోసపోతూ, విద్యార్థులు కోట్లు ఫీజులుగా చెల్లిస్తుంటే.. కార్పొరేట్ యాజమాన్యాలు కోట్లకు పడగలెత్తుతున్నాయి.

దీంతో వారిని ప్రశ్నించే నాథుడే కరువయ్యాడు. విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు చొరవ తీసుకుని ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు కూడా పట్టించుకోవాలి. వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలి.

టీచర్ ఎమ్మెల్సీ స్థానాల నుంచి శాసన మండలికి ఎన్నికైన సభ్యులు కూడా వీరి గురించి గొంతెత్తాలి. గిగ్ వర్కర్ల కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేసినట్లుగా, ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా గిగ్ వర్కర్ల జాబితాలో చేర్చాలి. వీరికి సామాజిక, ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పించాలి.

 అళవందార్ వేణుమాధవ్, 

హైదరాబాద్