calender_icon.png 3 February, 2026 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేధింపుల సర్కార్

03-02-2026 02:01:29 AM

ఫోన్ ట్యాపింగ్..- ఒక అబద్ధాల పుట్ట

  1. కేసీఆర్‌ను విచారించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు 
  2. ఢిల్లీ పర్యటనలతో రేవంత్‌రెడ్డి సాధించింది సున్నా
  3. పెట్టుబడులు ప్రకటించారు.. పరిశ్రమలెక్కడ..?
  4. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీదే విజయం 
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో నడుస్తున్నది వేధింపు ల ప్రభుత్వమని, ఫోన్ ట్యాపింగ్ ఒక అబద్ధాల పుట్ట అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను గంటల తరబడి విచారించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న తమ నివాసంలో మీడియా తో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీలు, ఆందోళనలు చూస్తే తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తొచ్చాయని తెలిపారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధపు ప్రచారాలు, అక్రమ విచారణలతో ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తోందని నిప్పులు చెరి గారు. కేసీఆర్‌ను విచారణ పేరిట గంటల తరబడి కూర్చోబెట్టడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అన్నారు.

చట్టప్రకారం ఆయన నివాసానికే వచ్చి విచారణ చేయాల్సి ఉన్నా, హుందాగా కేసీఆరే వెళ్లారని గుర్తు చేశారు. 900 మంది పోలీసుల మోహరింపు కేవలం మీడియా అటెన్షన్ కోసమేనని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ‘సిట్’ల పేరిట ఎంక్వైరీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం ఒక ‘డైవర్షన్’ సబ్జెక్టు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏ బిజినెస్ మ్యాన్ గానీ, ఏ నటి గానీ ఫిర్యాదు ఇవ్వలేదని, ఇదంతా ఒక కల్పిత కథ అని కొట్టిపారేశారు.

రాజ్యాంగం ప్రకారమే ఇంటెలిజెన్స్ వ్యవస్థ నడుస్తుందని, రేవంత్‌రెడ్డికి కూడా సమాచారం వస్తోందని, అందులో అక్రమమేమీ లేదని వివరించారు. ప్రతి ప్రభుత్వంలో పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమని, కేసీఆర్ హయాంలో కూడా అదే జరిగిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తు న్న అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు.

మీడియా కూడా ప్రభుత్వ అబద్ధాలను యథాతథంగా ప్రచురించడం మానుకోవాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ వాట్సాప్ గ్రూపుల ద్వారా బీఆర్‌ఎస్ పై విషప్రచారం చేస్తున్నారని సీఎంవో నుంచే దుష్ర్పచారాలు సాగడం బాధాకరమన్నారు. ఏదైనా ఇల్లీగల్ అని చెప్పడానికి ఆధారాలు ఉంటే వాటిని కోర్టులో సమర్పించాలి తప్ప, ట్వీట్లు లేదా ప్రెస్ మీట్లలో తీర్పులు ఇవ్వకూడదని అన్నారు.

సజ్జనార్ ఏమైనా జడ్జి అయ్యాడా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక విషయం చట్టవిరుద్ధమా కాదా అని తేల్చాల్సింది కోర్టులు మాత్రమేన ని, పోలీసులు కేవలం అభియోగాలు మోపి ఆధారాలు చూపాలని హితవు పలికారు. కాం గ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పరిపాలనా, శాంతి భద్రత, వనరుల దోపిడీ వంటి ప్రధాన వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతోందని విమర్శించా రు.

మేడారం జాతరను కూడా సక్రమంగా నిర్వహించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదన్నారు. కోఠిలో పట్టపగలు బ్యాంకులో కాల్పు లు జరిపి దోపిడీ చేయడం, చందానగర్‌లో గోల్డ్ షాపు లూటీ వంటి ఘటనలు శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతున్నాయని అన్నా రు. ‘డే లైట్ మర్డర్లు, డే లైట్ బ్యాంక్ రాబరీలు’ సాధారణమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..

కేంద్ర బడ్జెట్ విషయంలోనూ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికే లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ అయిన హైదరాబాద్‌కు బయో ఫార్మా రంగంలో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమ న్నారు. కేంద్ర ప్రభుత్వం నెలకు లక్ష కోట్ల వడ్డీ కట్టేలా దేశాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోందని ధ్వజమెత్తారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కోత విధించడం, ఎరువుల సబ్సిడీ, ఆహార సబ్సిడీని తగ్గించడం వంటి నిర్ణయాలు సామాన్యులపై భారాన్ని పెంచుతాయని విశ్లేషించారు.

కేంద్ర ప్రభుత్వం సుమారు 208 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, కేవలం వడ్డీల రూపంలోనే నెలకు లక్ష కోట్ల రూపాయలు చెల్లిస్తోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి సాధించింది ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం తన వ్యక్తిగత కేసులు మాఫీ చేసుకోవడానికే రేవంత్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.

గత మూడు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి మూడు సార్లు దావోస్‌కు వెళ్లారని, కానీ ఒక్క పెట్టుబడైనా వాస్తవంగా నేలమీదకి వచ్చిందా అని ప్రశ్నించారు. దావోస్‌లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని గొప్పగా ప్రకటనలు చేస్తున్నారని, కానీ ఆ పరిశ్రమలు ఎక్కడ స్థాపించారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2024లో మాత్రమే లక్షల కోట్ల పెట్టుబడుల ప్రకటనలు చేశారని, వాటిలో ఎంత శాతం అమలయ్యాయో తెలపాలని కోరారు. 

మున్సిపోల్స్‌లో విజయం సాధిస్తాం..

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించబోతోందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో 143 మున్సిపాలిటీల్లో 135 గెలిచామని, ఈసారి అనేక స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీని బ్లాక్ మెయిల్ పార్టీ అన్న వారి వ్యాఖ్యలను తిప్పికొడుతూ, అసలైన బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని ఘాటుగా విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను ‘బ్లాక్‌మైల్ పార్టీ’గా చిత్రీకరించేందుకు ప్రయత్నిం చడం హాస్యాస్పదమని వ్యాఖ్యానిస్తూ, నిజంగా ఎవరి మీద బ్లాక్‌మైల్ చేశామో పేర్లు చెప్పాలని సవాల్ విసిరారు. ఆర్టీఐ దుకాణాలు పెట్టి కోట్లు సంపాదించిన చరిత్ర రేవంత్‌ది అని మండిపడ్డారు.

తెలంగాణకు బీజేపీ ఏమి చేసిందో చెప్పాలి..

‘మేము ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు భయపడే వాళ్లం కాదు. పదేళ్లుగా మీడియాను ఎదుర్కోని వాళ్లు మాకు నీతులు చెప్పడం హాస్యాస్పదం’ అని కిషన్‌రెడ్డి ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కిషన్‌రెడ్డి ముందు తన పార్టీ పరిస్థితి గురించి మాట్లాడాలని, కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం సాధించిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మెగా పవర్‌లూమ్ క్లస్టర్ వంటి దీర్ఘకాలిక డిమాండ్లపై ఇప్పటికీ నిధులు రాకపోవడాన్ని గుర్తుచేస్తూ, కేవలం మాటలతో సరిపెట్టడం కాకుండా ఫలితాలు చూపాలని సూచించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంటే దాన్ని ప్రశ్నించకుండా రాష్ర్టంలో రాజకీయ విమర్శలకే పరిమితం కావడం సరికాదని అన్నారు. 

సీఎం బామ్మర్ది సింగరేణి స్కాం..

సింగరేణి బొగ్గు గనుల టెండర్లలో సీఎం బామ్మర్ది సృజన్‌రెడ్డి భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘సైట్ విజిటేషన్ సర్టిఫికేట్’ నిబంధనను కంపల్సరీ చేసిన తర్వాత, అసలు ఎంతమంది సైట్ విజిట్ చేశారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సృజన్ రెడ్డి కాల్ డేటా తీస్తే ఎవరెవరికి ఫోన్లు వెళ్లాయో, కుంభకోణం ఎలా జరిగిందో అడ్డంగా దొరికిపోతారని సవాల్ విసిరారు.ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసినా, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి విషయంలో కుమ్మక్కయ్యాయని, అందుకే వాస్తవాలు బయటికి రావడం లేదని విమర్శించారు. ఒక సీఎండీ స్థాయి అధికారిని విచారించడానికి నాలుగైదు ర్యాంకులు తక్కువ ఉన్న వ్యక్తితో కమిటీ వేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు బౌన్సర్లతో వెళ్లి భూములను ఆక్రమిస్తుంటే,

చట్టప్రకారం కేసు పెట్టిన సీఐ హబీబుల్లా ఖాన్‌ను వెంటనే బదిలీ చేయడం ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. కృష్ణా నది ప్రాజెక్టుల విషయంలో రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి తన పాత బాస్ చంద్రబాబుకు, కేంద్రానికి దాసోహం అవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.