calender_icon.png 26 December, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిఘా నేత్రాలపై నిర్లక్ష్యమేల

26-12-2025 04:05:28 PM

ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం 

కొన్ని నెలలుగా పనిచేయని సీసీ కెమెరాలు. 

ఇప్పటికీ సీసీ కెమెరాలు నోచుకోని పలు గ్రామాలు.

సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రజల వేడుకోలు 

వేములపల్లి,(విజయక్రాంతి): ఒక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం. ఎక్కడైనా చోరీలు ప్రమాదాలు వంటివి చోటు చేసుకుంటే నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి. పోలీసులు వారం రోజుల్లో చేయాల్సిన దర్యాప్తు వీటి సహాయంతో ఒక్కరోజులోనే పూర్తిచేసే వీలుంటుంది. ఆధునిక సమాజంలో నేరాలు పూర్తిగా మారిపోయాయి. పూటకు తీరుతో కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి నియంత్రణకు సీసీ కెమెరాలు వినియోగం ఉపయుక్తంగా ఉంటుంది. 

వేములపల్లి మండలంలో ఇలా

వేములపల్లి మండలంలో 12 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అన్నపరెడ్డిగూడెం, వేములపల్లి, బుగ్గ బావి గూడెం, శెట్టిపాలెం, మొల్కపట్నం, సల్కునూరు, మంగాపురం కామేపల్లిగూడెం, రావులపెంట, లక్ష్మీదేవి గూడెం, అమనగల్లు, తిమ్మారెడ్డి గూడెం గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో అమనగల్లు, రావులపెంట, శెట్టిపాలెంలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

శెట్టిపాలెం గ్రామంలో సుమారుగా 10 లక్షల రూపాయల తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని  ఒకటి, రెండు మాత్రమే పనిచేస్తాయి.  ఆయా గ్రామాలలో సీసీ కెమెరాలు కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. గత కొన్ని నెలలుగా వరుసగా జరుగుతున్న సంఘటనలు నిఘా నేత్రాలు పనిచేయకపోవడం గ్రామాలలో తరచూ దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సీసీ కెమెరాలను పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికీ సీసీ కెమెరాలు నోచుకోని గ్రామాలు

మండలంలో ఇప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆధునిక కాలంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ మండలంలోని  లక్ష్మీదేవి గూడెం, మొల్కపట్నం, సల్కునూరు, మంగాపురం ,అన్నపరెడ్డిగూడెం, కామ పళ్లి గూడెం, బుగ్గ బావి గూడెం, తిమ్మారెడ్డి గూడెం తదితర గ్రామాలలో సీసీ కెమెరాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. రాత్రి వేళలో దొంగతనాలు, అనుకోకుండా జరిగే సంఘటనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో నిఘా వ్యవస్థ గట్టిగా ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవు అని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ ప్రజాప్రతినిధులు స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు.