05-08-2025 01:19:12 AM
గచ్చిబౌలి, ఆగస్టు 4 (విజయక్రాంతి): కేబుల్, బ్రాడ్బ్యాండ్, ఓటీటీ రంగాలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో మాదాపూర్ హైటెక్స్లో నిర్వహించబోతున్న 13వ కేబుల్ నెట్ కాన్వర్జెన్స్ ఎగ్జిబిషన్కు సంబంధించిన ప్రెస్ మీట్ ఈరోజు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 5, 6, 7 తేదీలలో మూడు రోజులపాటు హైటెక్స్లో జరుగనుంది. ఈ మహా ప్రదర్శనను రేపు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు.
కేబుల్, బ్రాడ్బ్యాండ్, ఓటీటీ, కంటెంట్ రంగాల్లో చోటుచేసుకుంటున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాలు, మార్పులు, భవిష్యత్తు అవకాశాలపై ఈ ఎగ్జిబిషన్ దృష్టి సారించనుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు, బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర పారిశ్రామికవేత్తలకు ఇది కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించే వేదికగా నిలవనుంది. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ తాజా ఉత్పత్తులు, సేవలు, సాంకేతిక పరిజ్ఞానాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు పల్లా రాము తెలిపారు.
ఈ ఎగ్జిబిషన్ ద్వారా కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్లు, MSOలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ల మధ్య పరస్పర సహకారం పెరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రంగంలోని నిపుణులు, వ్యాపారవేత్తలు తమ అనుభవాన్ని పంచుకోవడానికి, కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి, వ్యాపారాలను విస్తరించుకునేందుకు ఇది చక్కటి వేదిక అవుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎగ్జిబిషన్ను సందర్శించి తాజా సమాచారం, సాంకేతికతలపై అవగాహన పెంపొందించుకోవాలని నిర్వాహకులు కోరారు.