25-10-2025 12:12:51 AM
పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): బీసీలను రౌడీలు అనడం కేసీఆర్ దొరకు అలవాటేనని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబాన్ని రౌడీ కుటుంబం అని కేసీఆర్ అగ్రకుల దురహంకారంతో మాట్లాడటం తగదని హితవు పలికారు. పదేళ్ల కేసీఆర్ దొర పాలనలో నవీన్ యాదవ్‌పై ఎన్ని కేసులున్నాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉపఎన్నిక జరుగుతున్న ఈ సమయంలో రౌడీషీటర్లను, పోక్సో కేసులున్న వారిని బీఆర్‌ఎస్ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారో కేసీఆరే సమాధానం చెప్పాలన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ప్రజల ఆదరణ పొందుతుంటే ఓర్వలేకనే ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు.
కేంద్రంలోని బీజేపీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలతో ఆదరణ కోల్పోయిందన్నారు. ఓట్ల కోసం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చే బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలని, అధికార కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని బండి సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు.