09-08-2025 12:00:00 AM
కేసముద్రం రైల్వే స్టేషన్‌లో ఘటన
మహబూబాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున రైల్వే క్యాంపరింగ్ ట్రైన్ కోచ్‌లో అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా దగ్ధమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో నిద్రిస్తున్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు, ఇద్దరు సిబ్బంది వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది.
కేసముద్రం రైల్వే స్టేషన్‌లో నూతనంగా నిర్మిస్తున్న మూడో లైన్ ట్రాక్ పనుల నిర్వహణ కోసం ట్రాక్ మిషన్ తెప్పించారు. ఈ మిషన్ పని చేయడానికి అవసరమైన ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, అందుకు అవసరమైన సామగ్రిని ఈ క్యాంపెనింగ్ ట్రైన్ కోచ్‌లో ఉంచుతారు. క్యాంపెనింగ్ ట్రైన్ కోచ్ కొత్తగా నిర్మిస్తున్న రైల్వే నాలుగవ ట్రాక్‌పై ఉంచారు.
ఇందులో శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో ఒకసారిగా మంటలు చెలరేగగా, సిబ్బంది గుర్తించారు. వెంటనే వాళ్లు బయటకు వచ్చి విషయాన్ని రైల్వే అధికారులకు, స్థానిక పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా మహబూబాబాద్ నుంచి అగ్నిమాపక యంత్రం వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. ఘటనకు విద్యుత్ షార్ట్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటన వల్ల సుమారు కోటికి పైగా రైల్వేకు నష్టం వచ్చినట్లు అంచనా.