calender_icon.png 9 August, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటరిగానే గువ్వల నడక.!

09-08-2025 08:22:39 AM

  1. బిఆర్ఎస్ వీడి కమలం గూటికి వెళ్లేందుకు సంసిద్ధం. 
  2. వెంట రాణి గులాబీ క్యాడర్. 
  3. ప్రత్యర్థి వెళ్ళిన చోటుకే తాను వెళ్లేందుకు సిద్ధం. 
  4. కమలం గూటికి వెళ్లేందుకు కేడర్ విముఖత. 
  5. ఆసక్తికరంగా అచ్చంపేట రాజకీయం.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ సమయంలో కార్యకర్తగా అచ్చంపేటలో కాలు మోపిన తనను గుండెలకు హత్తుకుని అసెంబ్లీకి పంపిన గడ్డ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం వేసిన అడుగుల్లో తాము నడవలేమని వెంట వెళ్లేందుకు విముఖత చూపుతోంది. సుదీర్ఘ కాలం పాటు ఉద్యమంలో పాల్గొని ఉద్యమ పార్టీగా పేరొందిన పార్టీ సహకారంతో అంచలంచలుగా ఎదిగాడు. ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ గా పని చేయడంతో పాటు జిల్లా అధ్యక్ష బాధ్యతలను కూడా చేపట్టాడు. కానీ ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం కమలం గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతోమంది యువతను నేతలుగా మార్చినప్పటికీ ప్రస్తుతం తన వెంట మాత్రం నడిచేందుకు వెనకాడతోందన్న ప్రచారం జరుగుతోంది.

ఈనెల 2న జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కు తన రాజీనామా పత్రాన్ని అందించాడు. కానీ తన వెంట నడిచే కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండానే సొంత నిర్ణయం తీసుకోవడం వల్లే తాను పార్టీ మారుతున్న అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈనెల 6న రాజీనామా అనంతరం మొట్టమొదటిసారిగా తన అనుచరులు ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయగా అక్కడే చాలామంది తాను పార్టీ మారడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరోసారి పార్టీ మార్పు అంశంలో పునరాలోచన చేయాలని ప్రాధేయపడ్డారు. దీంతోపాటు ఆ పార్టీ అధిష్టానం సైతం తన నిర్ణయాన్ని ఏమాత్రం అడ్డు చెప్పకుండా తన వెనకాల కార్యకర్తలకు మాత్రం భరోసా కల్పిస్తూ ప్రత్యేక సమావేశాలు, సభలు, సమ్మేళనాలు చేయడంతో ప్రస్తుతం గువ్వల(Guvvala Balaraju) వెంట కార్యవర్గం వెళ్లడం లేదన్న చర్చ జోరందుకుంది.

శుక్రవారం నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమ్మేళనంలో భారీగా టిఆర్ఎస్ కార్యకర్తలు హాజరు కావడంతో గువ్వల ఒంటరేనా అనే చర్చ ఊపందుకుంది. మరో పక్క మాజీ ఎంపీ రాములు, తన కుమారుడు భరత్ ప్రసాద్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు పలుమార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. జడ్పీ చైర్ పర్సన్ కుర్చీ దరిచేరకుండా గువ్వల పావులు కదిపినట్లు అప్పట్లో పెను దుమారం రేగింది. గత ఎన్నికల్లో గువ్వల నుండి తీవ్ర ఇబ్బందులకు గురైన వీరు బిజెపి పార్టీలోకి వెళ్లి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు.

తన కుమారుడి భవిష్యత్తు కోసం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గువ్వల బీజేపీకి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఇరువురి మధ్య ఏకాభిప్రాయం అందుతుందన్న ఆశలు తక్కువే. ఇటు టిఆర్ఎస్ పార్టీ నుండి తన వెంట క్యాడర్ రాకపోవడంతో పాటు బిజెపిలోకి అడుగుపెట్టినా అక్కడ కూడా తనకు ఆదరణ అందే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం గువ్వల ఒంటరిగానే మిగులుతాడా అన్న చర్చ జరుగుతుంది.