23-08-2025 05:10:46 PM
కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం(Kalwakurthy Constituency) వెల్దండ మండలం కొట్రగేట్ సమీపంలో వెళుతున్న ఒక కారులో మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కల్వకుర్తికి చెందిన పీట్ల సుధాకర్ తన వ్యక్తిగత పనుల కోసం కారులో వెల్దండకు బయలుదేరాడు. శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై ప్రయాణిస్తుండగా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు విపరీతంగా వ్యాపించడంతో భయపడిన సుధాకర్ వాహనాన్ని ఆపి బయటకు దూకాడు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది, కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.