23-08-2025 08:59:42 PM
గోవింద నామ స్మరణతో మారు మ్రోగిన కాంచన గుహ
చిన్న చింతకుంట: పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి కొండకు భక్తులు పోటెత్తారు. శనివారం ఆఖరి అమావాస్య కావడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా పల్లె ప్రాంతాల నుంచి భక్తులు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కాలినడకన ఉదయాన్నే కురుమూర్తి కొండకు చేరుకున్నారు. కొండ దిగువన స్వామి వారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి అక్కడి నుంచి నేరుగా కురుమూర్తి కొండ ప్రధాన మెట్లపై క్యూలైన్లలో బారులు తీరి స్వామివారి ప్రధానాలయంకు చేరుకుని భక్తులు గోవిందా ..గోవిందా కురుమూర్తి వాస గోవిందా అంటూ నామస్మరణతో కాంచన గుహ పులకరించింది.
అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి పాదుకలను దర్శించుకుని పునీతులయ్యారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు దొంగలు బెడదతో ఆందోళన చెందుతున్నారు. దేవస్థాన అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. మదనపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భక్తుడు మాసన్న యాదవ్ కొండపై గల దిగువ మెట్లకు 100 ఫీట్ లలో రేకుల షెడ్డు నిర్మాణానికి ముందుకు రావడం పై దేవస్థానం అధికారులు దాతను శాలువతో సత్కరించారు.