23-08-2025 09:10:55 PM
విద్యార్థి నాయకుడి నుంచి అఖిలభారత నాయకుదిగా ఎదిగిన సుధాకర్ రెడ్డి
సురవరం ఆశయాలు, ఆలోచననలు ముందుకుతీసుకెళ్లేందుకు ప్రతినబూనుదాం
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పీడిత, తాడిత ప్రజల పక్షాన పోరాడేందుకు అనేక మంది ప్రజా ఉద్యమనాయకులను దేశానికి అందించిన ఉత్తమమైన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా(CPI District Secretary SK Sabir Pasha) అన్నారు. సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం హైద్రాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి మృతిచెందారు. అయన మృతిపట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించిన అనంతరం సుధాకర్ రెడ్డి పార్టీకి, ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ... తెలంగాణ మట్టిలోనుంచి ఉద్భవించి, విద్యార్థి నాయకుడి నుంచి అఖిలభారత నాయకుడిగా ఎదిగి నాయకుడు సుధాకర్ రెడ్డి అని, విద్యార్థి నాయకుడిగా పనిచేస్తూనే అనేక మందిని ప్రగతిశీల సమాజ నిర్మాణానికి పోరాడే నాయకులుగా తీర్చిదిద్దిన నాయకుడు సురవరం అని కొనియాడారు. కమ్యూనిస్టు నాయకుడిగా ప్రజా పోరాటాల్లోనూ, ప్రజల పక్షాన పార్లమెంటులోనూ తన వానిని వినిపించి పరిపూర్ణమైన నాయకుడిగా తన జీవితాన్ని గడిపాడని, కార్మికులు, కర్షకులు, పేదల హక్కుల సాధనకోసం, సంక్షేమం కోసం అయన చేసిన పోరాటాలు కొత్త తరాలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఆర్ధిక, సామాజిక, అసమానతలు లేని భారతావని నిర్మాణం కమ్యూనిస్టు పార్టీతోనే సాధ్యమవుతుందని, ప్రపంచంలో మార్క్సిజం, కమ్యూనిజం తప్ప మరొక సైద్ధాంతిక సిద్ధాంతేమేది సమాజంలో అంతరాలను తొలగించలేదని నమ్మి, ఆ వాస్తవాన్ని అనేక మందికి నాయకులకు అందించిన నాయకుడు సుధాకరరెడ్డి అని అన్నారు. కుల, మత, విద్వేషం లేని ఐక్య సామాజిక జీవనం గడపాలని కోరుకున్న నిజమైన దేశభక్తికలిగిన నాయకుడు సురవరం అని అన్నారు.
అయన భౌతికంగా దూరమైనా అయన ఆలోచనలు, ఆశయాలు, అయన బాటలో నడుస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లడమే కమ్యూనిస్టు కార్యకర్తల కర్తవ్యమని అన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, సమైక్యతను, రాజ్యాంగాన్ని కాపాడే పోరాటాలను ఉదృతం చేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. మరణాంతరం కూడా తన శరీరం, తన జీవితం మొత్తం భారతీయ సమాజానికి అందించిన నాయకుడు సుధాకర్ రెడ్డి అని, నేటితరం యువతరానికి అయన స్ఫూర్తి, ఆ స్ఫూర్తిని కొనసాగించేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆంగ్రభాగాన నిలిచి ముందుకెళుతుందని సాబీర్ పాషా స్పష్టం చేశారు.