calender_icon.png 10 September, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల పులుసు కేరాఫ్ జూరాల

06-12-2024 02:03:42 AM

  1. కృష్ణమ్మ జలసవ్వడిల మధ్య ఘుమఘులాడే చేపల వంటకాలు..
  2. 200 మత్య్సకారుల కుటుంబాలకు ఉపాధి 

వనపర్తి, డిసెంబర్ 5 (విజయక్రాంతి): వనపర్తి, గద్వాల జిల్లాలకు అనుసంధానంగా ఉన్న జూరాల ప్రాజెక్టు వద్ద జల సవ్వళ్లు  దృశ్యాలు వర్ణించలేనివి. ప్రాజెక్టు గేట్లు ఎత్తారన్న విషయం తెలిసిదంటే సందర్శకుల తాకిడి విపరీతంగా ఉంటుంది. గేట్లు బంద్ అయినా కూడా కృష్ణమ్మ సోయగాలను, ప్రకృతి అందాలను వీక్షించేందుకు జూరాలకు పర్యాటకులు వస్తుంటారు.

కృష్ణమ్మ అందాలతో పాటు నోరూరించే ఘుమఘుమలాడే చేపల కూరలు ఇక్కడ ప్రత్యేకం. జూరాల అందాలను వీక్షించే సందర్శకుల కోసం మత్య్సకారుల కుటుంబాలు అప్పుడే పట్టి తెచ్చిన చేపలను వండి ఇస్తుంటారు. ఇష్టమైన చేపలను ఎంచుకుని వంట చేయించుకునే సౌలభ్యం ఇక్కడి ప్రత్యేకత. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి దాదాపు 200లకు పైగా మత్య్సకార కుటుంబాలు నివసిస్తున్నాయి.

ప్రాజెక్టుకు రెండు వైపులా చిన్న చిన్న హోటళ్లు ఉంటాయి. డ్యాముకు కుడి, ఎడమ వైపున తాజాగా పట్టుకొచ్చిన చేపలను అమ్ముతుంటారు. సందర్శకులు వాటిని కొని హోటళ్ల వాళ్లకు ఇవ్వడంతో కొద్ది నిమిషాల్లోనే చేపల ఫ్రై, పులుసును రెడీ చేసి ఇస్తారు.

సందర్శకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రాజెక్టులో దొరికే చేపల్ని వండించుకుని తిని ఆనందిస్తుంటారు. మత్స్యకారుల కుటుంబంలో ఒకరు చేపలను పడితే, మరొకరు విక్రయిస్తారు. ఇంకొకరు చేపలను శుభ్రం చేస్తారు. ఇంకొకరు తెచ్చిన చేపలను సందర్శులకు తగిన రీతిలో వండి ఇస్తారు. 

తాజా చేపల వేపుడు, పులుసు..

జూరాల ప్రాజెక్టులో గల చేపలను సందర్శకుల కండ్ల ముందే పట్టి, వారికి నచ్చిన రీతిలో చేపల పులుసు, వేపుడు వంటివి చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఎలాంటి రసాయన పదార్థాలు కలుపకుండా ఇంట్లో రోజు వాడే పదార్థాలతోనే రుచికరమైన వంటలు చేస్తారు. ఇలాంటి ప్రత్యేక మైన వంటకాలను ఆరగించడం చాలా తృప్తిగా ఉంటుందని పర్యాటకులు చెబుతుంటారు. చేపల పులుసు, వేపుళ్లను ఆరగించడంతో పాటు ఇంటికి సైతం తీసుకెళ్తారు.