06-12-2024 02:01:17 AM
నిర్మల్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రెవెన్యూ శాఖలో గ్రామస్థాయిలో పనిచేసే వీఆర్‌ఏ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరణ చేయనున్నట్టు ప్రకటించడంతో వారసత్వ ఉద్యోగాల కోసం వారి కుటుంబసభ్యులు ఆందోళన బాటపట్టారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వీఆర్‌ఏల వారసత్వ ఉద్యోగాల కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వారు తెలిపారు. ప్రభుత్వం ఏపని చేపట్టాలన్నా గ్రామాల్లో వీఆర్‌ఏల సహకారం తప్పనిసరి. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా వారసత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వీఆర్‌ఏలు కోరారు.
అయితే గత సర్కారు వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. తమ ఆశలపై నీళ్లు చల్లడంతో ఆందోళనలు చేసినా గత సర్కారు పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
81, 86 జీవోలు అమలు చేయాలి
గత ప్రభుత్వం వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయక ముందు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు జీవో 81, 86 జారీ చేసినట్టు వారు గుర్తు చేశారు. ఈ జీవో ప్రకారం వీఆర్‌ఏగా పని చేస్తూ 61 ఏళ్లు నిండిన వారి కుటుంబసభ్యులకు ఉగ్యోగం కల్పించేందుకు సర్కారు అవకావం కల్పించింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 200 మంది దరఖాస్తు చేసుకున్నారు.
చాలీచాలని వేతనాలు తీసుకుంటూ.. ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏపని చేపట్టినా ప్రధాన భూమి క పోశిస్తున్న తమపై ప్రభుత్వం కనికరం చూపకపోవడంపై వా రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీఆర్‌ఏ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ప్రకటించడంతో మళ్లీ వారు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే మండల, జిల్లాస్థాయిలో ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవ డంతో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టాలని వారు నిర్ణయించుకున్నారు.
గత సర్కారు మోసం చేసింది..
తాత ముత్తాతల కాలం నుంచి గ్రామాల్లో వీఆర్‌ఏలుగా వంతుల వారీగా పనిచేస్తున్నాం. గత ప్రభుత్వం వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి మాకు తీవ్ర అన్యాయం చేసింది. 61 ఏళ్లు నిండిన వీఆర్‌ఏలు వయస్సు, ఆర్యోగ కారణాల దృష్ట్యా వారసత్వ ఉద్యోగాలు చేసుకునేందుకు ప్రభుత్వం 81, 86 జీవోను జారీ చేసింది. ఈ జీవోను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నాం. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. త్వరలో జేఏసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తాం. గౌతు రవి, నిర్మల్
కాంగ్రెస్ ప్రభుతంపైనే ఆశలు..
ఐదు తరాలుగా మేం వీఆర్‌ఏలుగా పనిచేస్తున్నాం. వారసత్వ ఉద్యోగాల కోసం ఐదేళ్ల కింద దరఖాస్తు చేసుకున్నాం. ఉద్యోగాల కల్పనకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్న నేపథ్యంలో మాకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తారనే నమ్మకం మాకు ఉంది. అందుకే పోరాటం చేస్తున్నాం. మా కుటుంబసభ్యుల ఉద్యోగాలు మాకు ఇవ్వమని అడగుతున్నాం. పల్లవి, సోన్