19-12-2025 12:00:00 AM
మహబూబాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పై పెట్టిన నేషనల్ హోరాల్ కేసు పచ్చి బూటకమని, రాజకీయ కుట్రతో కేంద్రం వ్యవహరిస్తుందని, ఇటువంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో నిరసన కార్యక్రమం ఇరు పార్టీల మధ్య ఘర్షణకు దారితీసి, ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి శాంతింపజేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే హనుమకొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తత దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మురళి నాయక్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు బిజెపి జేబు సంస్థలుగా మారిపోయాయని విమర్శించారు. ప్రజలు రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పట్ల చూపిస్తున్న అభిమానాన్ని తట్టుకోలేక బిజెపి ప్రభుత్వం కుట్రపూరిత పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం కాంగ్రెస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు.