21-12-2025 12:53:33 AM
పంచాయతీ ఎన్నికలతో స్పష్టమైన క్షేత్రస్థాయి పరిస్థితులు
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి) : పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. గత పది రోజులు రాష్ట్రమంతా హడావిడి వాతావరణం నెలకొన్నది. ఆయా పార్టీలు తమ మద్దతు దారుల తరఫున విస్తృతంగా ప్రచారం చేసి గెలిపించుకున్నాయి. అయితే, పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సింహాభాగాన్ని కైవసం చేసుకున్నది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ తన ఉనికి చాటుకోవడంతోపాటు రాజకీయ వర్గాలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఏ రాష్ట్రంలోనైనా జరిగే ఉప, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల ఫలితాలు రావడం సహజమే.
తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ.. అధికార పార్టీ అంచనా వేసుకున్న స్థాయిలో మాత్రం సర్పంచ్ స్థానాలు గెలుచుకోలేకపోయింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్ పార్టీకి గ్రామీణ స్థాయిలో ఉన్న బలాన్ని మరోసారి స్పష్టంగా నిరూపించాయి. అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధిం చినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా బయటపడ్డాయి.
చెక్కు చెదరని బీఆర్‌ఎస్ కేడర్..
12వేల గ్రామాల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ సు మారు 50 శాతం స్థానాలు గెలుచుకోగా, బీఆర్‌ఎస్ పార్టీ దాదాపు 30 శాతం పంచాయతీలను కైవసం చేసుకుంది. వాస్తవానికి అధికారంలో ఉ న్న పార్టీకి కొంత మేర సానుకూలమైన వాతావర ణం ఉండటం సహజమే. కానీ ఆశించిన మేర కాం గ్రెస్ పార్టీ సర్పంచులను గెలుచుకోలేకపోయింది. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే బీఆర్‌ఎస్ ఎంతో పుంజుకున్నట్టు తాజా పంచాయతీ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రభావం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్ కేడర్ చెక్కు చెదరలేదు.
ప్రజల్లో సానుకూలత...
క్షేత్రస్థాయిలోని బలమైన కేడర్ బీఆర్‌ఎస్ పార్టీకి ప్రధాన బలంగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీ నుంచి మండల స్థాయి వరకు పార్టీ కార్యకర్తలు నిరంతరంగా ప్రజల మధ్య ఉంటూ సమస్యలను ముందుకు తీసుకెళ్లడం బీఆర్‌ఎస్‌కు రాజకీయ ఆధిక్యతను ఇస్తోంది. అధికారంలో లేని పరిస్థితుల్లోనూ కేడర్ నిర్వీర్యం కాకుండా చురుకుగా కొనసాగడం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. పలు చోట్ల పార్టీ తరఫున అధికారిక మద్దతు లేకపోయినా, స్వతంత్రులుగా బరిలో దిగి న బీఆర్‌ఎస్ అనుబంధ నేతలు విజయం సాధించడం కేడర్ బలం ఎంత పటిష్టమో చాటుతోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి.
కాంగ్రెస్ గెలిచినా...
ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీపై గ్రామీణ స్థాయిలో పెరుగుతున్న వ్యతిరేకతను బయటపెట్టాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు, పాలన విధానాలపై ప్రజల్లో ఏర్పడిన సందేహాలు ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణాలుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికల హామీల అమలులో జాప్యం ఓటర్లలో నిరాశను కలిగించింది. రైతులు, పేద వర్గాలు ఆశించిన స్థాయిలో తక్షణ ఫలితాలు కనిపించకపోవడంతో అసంతృప్తి వ్యక్తమైంది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు స్పష్టంగా బయటపడ్డాయి.
పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు తీవ్ర పోటీ ఎదుర్కోవడం, కొన్నిచోట్ల స్వల్ప తేడాతో గెలుపు సాధించడం క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు అంత బలంగా లేదన్న భావనకు దారితీసిం ది. అధికార పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేరకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఈ ప్రతికూల పరిస్థితులు రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ప్రతిపక్ష పాత్రలోనూ మెరుగైన పనితీరు
అధికారంలో లేకపోయినా బీఆర్‌ఎస్ ప్రతిపక్షంగా తన రాజకీయ స్థానాన్ని స్పష్టంగా, ధృఢంగా కొనసాగించడం మరో కీలక అనుకూల అంశంగా మారింది. ప్రభుత్వ విధానాల్లో లోపాలు, ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలపై నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. శాసనస భలోనూ, బయట ప్రజా వేదికలపైనా బీఆర్‌ఎస్ నాయకత్వం సమన్వయంతో స్పందించడం వల్ల పార్టీ గళం బలంగా వినిపించింది. రైతులు, ఉద్యోగులు, మహిళలు, పేద వర్గాలకు సంబంధించిన అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవడం ద్వారా బాధ్యతాయుత ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ గుర్తింపు పొందుతుంది. ఈ పట్టు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి కీలకంగా మారనున్నది.