calender_icon.png 21 December, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెబల్స్‌ను బుజ్జగించరా?

21-12-2025 01:06:19 AM

మీ వల్లే నష్టపోయాం

  1.   16 మంది ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్! 
  2. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయలేదని ఆగ్రహం 
  3. నల్లగొండ, వరంగల్, పాలమూరుతోపాటు పలు జిల్లాల ఎమ్మెల్యేలకు క్లాస్ 
  4. నియోజకవర్గ ఇన్‌చార్జీలు, డీసీసీ అధ్యక్షుల మధ్య సమన్వయలోపం 
  5. జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకోవాలని టీపీసీసీకి మీనాక్షి నటరాజన్ సూచన

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. మూడు విడత ల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనా వేసిన దానికన్నా తక్కువ స్థానా ల్లో గెలవడం, బీఆర్‌ఎస్ ఎక్కువ స్థానాలు విజయం సాధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెబల్స్‌ను సమన్వయం చేయలేకపోయారని, సరిగా పనిచే యలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. మీ వల్లే నష్టపోయామంటూ.. మొత్తం 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం మండిపడినట్లు తెలిసింది.

రెబల్స్‌ను బుజ్జగించి పోటీనుంచి త ప్పించడంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు చొరవ తీసుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పలు జిల్లాల నేతల నుంచి ఫిర్యాదులొచ్చాయి. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు మరికొంత మంది సమావేశంలో పాల్గొని ఫలి తాలపై సమీక్ష నిర్వహించారు.

పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెబల్స్‌తో సమన్వయ లోపం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడాన్ని తప్పుబట్టారు. పార్టీకి తీరని నష్టం చేశారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు తమ వైఖరి మార్చుకుని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని హెచ్చరించిన ట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీల మధ్య సమన్వయలోపం కూడా ఇందుకు కారణమని చెప్పినట్లు సమాచారం. రెబల్స్‌ను బుజ్జగిస్తే మరికొన్ని స్థానాలు మనమే గెలిచేవాళ్లమని ఎమ్మెల్యేలతో చెప్పినట్లు సమాచారం.

 పునరావృతం కావొద్దు : మినాక్షి వార్నింగ్

మీ వల్లే ఓడిపోయామని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడంతో ప్రతిపక్ష పార్టీలకు కలిసొచ్చిందని నేతలతో చెప్పినట్లు తెలిసింది. మీ సమన్వయం లోపం వల్ల గెలిచే స్థానాలను కోల్పోవాల్సి వచ్చిందని, ప్రధానంగా నల్లగొండ, వరంగల్, పాలమూరుతోపాటు మరికొన్ని జిల్లాల నేతలకు సీఎం, మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మరోసారి ఇది పునరావృతం కావొద్దని నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.

గెలిచిన రెబల్స్‌ను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కు మీనాక్షి నటరాజన్ సూచించినట్లు తెలిసింది. జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకొని నష్టానికి కారకులెవరో తేల్చాలని ఆదే శించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే సమగ్రంగా చర్చించేందుకు సమీక్షా సమావేశాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలో ఈనెల 11, 14, 17 తేదీలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను కట్టబెట్టారు.

ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో సుమారు 56 శాతం స్థానాలను గెలిచిన కాంగ్రెస్ పార్టీ మూడో ఫేజ్‌లోనూ అదే హవాను కొనసాగించింది. మొత్తం 12,733 స్థానా ల్లో 7,010 స్థానాలు, బీఆర్‌ఎస్ 3,502, బీజేపీ 688, ఇతరులు 1505 చోట్ల విజయం సా ధించారు. కాంగ్రెస్‌కు పట్టున్న కొన్ని ప్రాంతాల్లో సర్పంచ్ స్థానాలను కోల్పోవడంతో దానికి బాధ్యులైన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సమావేశాన్ని నిర్వహించారు.