calender_icon.png 21 December, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవి దొందూ దొందే!

21-12-2025 01:11:39 AM

  1. పరిపాలన, అవినీతి, దోపిడీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ది ఒకేతీరు 
  2. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజా వెన్నుపోటుదారులు
  3. రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులు అధిక సీట్లు సాధించాలి
  4. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలకు రాజ్యాంగంపై గౌరవం లేదు.. పార్టీ ఫిరాంపుల చట్టంపై విలువ లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాం కుటుంబ, అవినీతి పాలనగా సాగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తోందని.. పరిపాలన, అవినీతి, దోపిడీలో ఆ రెండు పార్టీలు దొందూ దొందే అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ మద్దతుతో పంచాయ తీ ఎన్నికల్లో  గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  ఎన్ రాం చందర్‌రావ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి , స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి  ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  మాట్లాడారు. బీఆర్‌ఎస్ జెండాపై గెలిచి, సిగ్గువిడిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతున్నప్పుడు తాము పార్టీ మారలేదని మాట మారుస్తున్నారని విమర్శించారు.

ఇది కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు సిగ్గుచేటు విషయమని పేర్కొన్నారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు ప్రజా వెన్నుపోటు దారులని కిషన్‌రెడ్డి అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వారందరికీ తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 

స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ధర్మ బద్ధంగా, రాజకీయాలకు అతీతంగా, న్యాయబద్ధంగా, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని, కానీ అలా జరగడం లేదని కిష నర్‌రెడ్డి ఆవేదనవ్యక్తం చేశారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు రాజకీయాలను భ్రష్టుపట్టించాయని విమర్శించారు. సమర్థ, అవినీతి రహిత పాలన కోసం రాష్ట్రం లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని  కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. 

అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

రాబోవు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుం దని కిషన్‌రెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గతంలో గంటే బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించిందని, వచ్చే ఎన్నికల్లోనూ కార్యకర్తలు, నేతలు సమష్టిగా ముందుకు సాగాలని సూచించారు. పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కేం ద్రం నిధులతోనేనని కేంద్రమంత్రి తెలిపారు. 

ఇటీవల పార్లమెంటులో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన చట్టాన్ని ఆమోదింపజేసి, సంవత్సరానికి గరిష్ట పనిదినాల సంఖ్యను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచిన ఘనత కూడా ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు.   రైతు కు వెన్నుదన్నుగా ఉంటూనే  ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఉచిత బియ్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తోందని  తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, రోడ్ల నిర్మా ణం, ఉపాధి హామీ నిధులు, గ్రామాల్లో రైతు వేదికలు, అంగన్వాడీ కేంద్రాలు, అంతర్గత రహదారులు వంటి అనేక అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

అన్ని స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.  ప్రతి కార్యకర్త కమలం గుర్తుతో ఇం టింటికీ వెళ్లి, నరేంద్ర మోదీ సుపరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.