28-11-2025 10:35:12 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి మండలంలో సర్పంచ్ పదవి కోసం పోటీ చేసే అభ్యర్థుల కుల ధ్రువీకరణ దరఖాస్తుల స్వీకరణను తహసీల్దార్ కార్యాలయం ప్రత్యేకంగా నిర్వహించింది. మీ సేవ కేంద్రాల్లో సర్వర్ సమస్యలు ఏర్పడటంతో, అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తహసీల్దార్ జయరాం మాన్యువల్‌గా ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు స్వీకరించారు.
సర్పంచ్ అభ్యర్థులు, వారి ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని కుల ధ్రువీకరణ దరఖాస్తులను సమర్పించారు. అధికారులు దరఖాస్తులను స్వీకరించి, అవసరమైన పరిశీలన అనంతరం త్వరితగతిన సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపారు. అభ్యర్థులు ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరిస్తున్న మండల తహసీల్దార్‌కి కృతజ్ఞతలు తెలిపారు.