28-11-2025 10:15:59 PM
11 ఏండ్ల మోడీ చేసిన అభివృద్ధిపై చర్చకు మీరు సిద్ధమా..?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి,(విజయక్రాంతి): దేశ నిర్మాణం, ప్రజా సంక్షేమం, అభివృద్ధి అంశాలపై కాంగ్రెస్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను ఎవరూ ఖండించలేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశ అభివృద్ధికి చేసిన సేవలపై తాము ఎప్పుడైనా చర్చకు సిద్ధమని, మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై బీజేపీ నాయకులు చర్చకు రావాలంటే ముందుగా ధైర్యం కావాలని సవాల్ విసిరారు.
జగ్గారెడ్డి మాట్లాడుతూ... నెహ్రూ దేశానికి ఎఫ్.సి.ఐ తెచ్చి పేదలకు అన్నం పెట్టే వ్యవస్థను నిర్మించారు. ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయకరించి భూములను పేదలకు పంచారు. రాజీవ్ గాంధీ యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చారు. సోనియా, రాహుల్ గాంధీ ఉపాధి హామీ పథకం, తెలంగాణ రాష్ట్రం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇది చరిత్ర. దీన్ని ఎవరూ తిరస్కరించలేరు అని ఉద్ఘాటించారు.
బీజేపీపై నిలదీస్తూ
స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అవుతోంది. ఆ సమయంలో బీజేపీ నాయకుడు లక్ష్మణ్ పుట్టలేదు. 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రకు 40 ఏళ్ల బీజేపీ ఎలా సరిపోతుంది? దేశ నిర్మాణంలో మోడీ, అమిత్ షా ఏం చేశారు చెప్పగలరా? అని ప్రశ్నించారు.
సంగారెడ్డి అభివృద్ధి విషయమై మాట్లాడుతూ
ప్రజలు ఇచ్చిన అవకాశంతో సంగారెడ్డిలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. నేను వీక్ లీడర్‌ను కాదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలవుతున్నాయి. ఉచిత బస్సులు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇండ్ల పథకాలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమల్లో ఉన్నాయి అని స్పష్టం చేశారు. చివరగా బీజేపీ నాయకులకు సవాల్ విసురుతూ రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల గురించి చర్చకు సిద్ధమా? మోడీ హయంలో ఏ అభివృద్ధి జరిగింది? ఓపెన్ డిబేట్‌కు రండి. ప్రజల ముందే మాట్లాడుకుందాం అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.