28-11-2025 10:26:38 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజా అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చెర నుండి కాపాడాలని శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఆకుల సతీష్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ నిజాంపేట్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత 2020లో అప్పటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు నిజాంపేట్ సర్వే నెంబర్ 87,88లో 3.06 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రజా అవసరాల కోసం మోడల్ మార్కెట్ కు కేటాయించారు.
అయితే ఈ స్థలం ఆక్రమణలకు గురి కాకుండా అప్పట్లో విధుల్లో ఉన్న కమిషనర్ ఐఎఎస్ గోపి స్థలాన్ని స్వాధీనం చేసుకొని కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేశారు. కానీ 2024 నుండి మోడల్ మార్కెట్ స్థలాన్ని కబ్జా చేయడానికి కిర్బీ షెడ్లు తీసివేసి, దాదాపు 5 అక్రమ నిర్మాణాలు చేశారని అన్నారు. గత సంవత్సరం నుండి ఈ తతాంగం జరుగుతున్నా కూడా ప్రస్తుత కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
సర్వే నెంబర్ 90,94 ను ఆనుకొని కార్పొరేషన్ మోడల్ మార్కెట్ స్థలంలో రెండు ఇండ్ల నిర్మాణాలకు గత పది రోజులుగా బోర్ వెల్ వేసి నిర్మాణ పనులు ప్రారంభించిన అధికారులు చర్యలు తీసుకోకపోవడం చూస్తేనే మోడల్ మార్కెట్ స్థలం కబ్జాదారులకి కబ్జా చేసుకునే విధంగా మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారని అన్నారు. తక్షణమే మున్సిపల్ కార్పొరేషన్ మోడల్ మార్కెట్ కోసం కేటాయించిన స్థలాన్ని సర్వే చేసి, అక్రమ నిర్మాణాలని కూల్చివేయాలని డిమాండ్ చేశారు.