06-08-2025 02:28:55 PM
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు డిమాండ్
కాగజ్ నగర్, (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబం అవినీతి, అక్రమాలకు పాల్పడిందని, పూర్తిస్థాయి అవినీతిని వెలికి తీయాలంటే సీబీఐ విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామ చందర్రావు(N. Ramchander Rao) డిమాండ్ చేశారు. బుధవారం కాగజ్ నగర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా కాళేశ్వరం డ్రామా నడుస్తుందని, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచారణే శరణ్య మన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరంకు తరలించి తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేశారని, కొత్త డిపిఆర్ తయారు చేయించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.
ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ జీవో నెం. 49 విషయంలో కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే మొదట ప్రతిపాదనను సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం .49 ని విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం తాత్కాలిక నిలుపుదల చేశారని తెలిపారు. వెంటనే ఈ జీవో ను రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు, మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత, జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, మాజీ జిల్లా అధ్యక్షులు డా.కొత్తపల్లి శ్రీనివాస్, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, వివిధ మండలాల అధ్యక్షులు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.