calender_icon.png 6 August, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది

06-08-2025 05:41:39 PM

బిల్లులు వెంటనే లబ్ధిదారులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి..

ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపు అంశాలపై లబ్ధిదారులతో సమీక్ష..

రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్..

కామారెడ్డి (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిలో రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్(Housing Corporation MD Gautam) అన్నారు. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాలో మొదటి స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan)ను, జిల్లా అధికార యంత్రంగాన్ని ఆయన అభినందించారు. బుధవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం బస్సాపూర్ గ్రామంను హౌసింగ్ అధికారులతో, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి బిక్నూరు మండల కేంద్రంలో ఫిల్టర్ రూప్ టెక్నాలజీ ద్వారా నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ ను, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను, దోమకొండ మండలంలోని గొట్టిముక్కల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సందర్భంగా ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపు అంశాలపై లబ్ధిదారులతో మాట్లాడారు.

లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉచితంగా ఇసుక  సరఫరా అయ్యేలా చూడాలని, దశలవారీగా నిర్మాణం జరిగిన కొద్దీ బిల్లులు వెంటనే  లబ్ధిదారులకు చెల్లించేలా  చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో  జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై  సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నదని, ఇందిరమ్మ లబ్ధిదారులచే ఇండ్ల నిర్మాణం ప్రారంభించడం, ఇండ్ల నిర్మాణాలకు ఇసుక, మొరం మరియు ఇతర మెటీరియల్, బిల్లుల చెల్లింపులలో ఎక్కడ సమస్య రాకుండా క్లస్టర్ వారిగా అధికారులను నియమించి అధికారులతో సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలలో పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కు, ఇండ్ల నిర్మాణంలో పాలుపంచుకుంటున్న అన్ని స్థాయిల అధికారులకు అభినందనలు తెలిపారు.   

బిక్నూర్ మండల కేంద్రంలో  ఫిల్టర్ రూప్ పద్ధతిలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ హౌసును చూడడం జరిగిందని, మామూలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కంటే ఈ పద్ధతిలో నిర్మించుకోవడం వలన నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా ఇల్లు వేసవి కాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుందని లబ్ధిదారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులను, మేస్త్రి లను  తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో చూపించాలన్నారు. ఇసుక అనేది ప్రభుత్వ ఆస్తి అని ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరు ఇసుక సరఫరా చేసిన అది చట్ట విరుద్ధం  అని అలాంటి వారిపై నిగా పెట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే సమయంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు  ఇలాంటి సమస్య ఇసుక రాకుండా హౌసింగ్ అధికారులు తాసిల్దార్, ఎంపీడీవోలతో సమన్వయం చేసుకొని  ఉచితంగా ఇసుక టోకెన్లు అందించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే ఇసుక రవాణా కొరకు ట్రాక్టర్లకు, లేబర్స్ లబ్ధిదారులు చార్జీలు చెల్లించేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.

తద్వారా ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో  ఎక్కువ వారం లబ్ధిదారుల పైన పడకుండా ఉంటుందని అన్నారు. అదేవిధంగా  ఏర్పాటు చేసిన మండల స్థాయి  ధరల నియంత్రణ కమిటీ కంకర, రాడ్లు, సిమెంటు, ఇటుకలు సరఫరా అయ్యేలా చూడాలని, మేస్త్రీలు అధిక మొత్తంలో  నిర్మాణ చార్జీలు తీసుకోకుండా చూడాలని అన్నారు. హౌసింగ్ ఇంజనీర్లు ప్రతిరోజు నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను సందర్శించి లబ్ధిదారులకు సూచనలు, సలహాలు ఇస్తూ నాణ్యతగా ఇల్లు నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. వారం వారం లబ్ధిదారులకు బిల్లును చెల్లించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మట్టి గట్టిగా ఉంటుందని అన్ని ప్రాంతాలలో నిర్మాణానికి పిల్లర్స్ అవసరం లేవని అన్నారు. ప్లింత్ భీమ్ మాత్రమే వేసుకోవాలి తప్ప కాలమ్స్, పిల్లర్స్ వేసుకోవాలని లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా అనర్హులు ఎంపిక అయితే  వారు ఏ స్థాయిలో ఇల్లు నిర్మించుకున్న ఇంటి నిర్మాణం ఆపివేసి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 12090 లక్ష్యంతో 11883 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా వాటిలో 5721 ఇండ్లకు ముగ్గు పోసి ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు 2182 ఇండ్లు బేస్మెంట్ లెవల్ వరకు, 66 ఇండ్లు రూప్ లెవల్ వరకు నిర్మాణం పూర్తికాగా 1 ఇల్లు  నిర్మాణం పూర్తయింది. 2111 ఇండ్లకు నిర్మాణ దశను బట్టి  బిల్లులు చెల్లించడం జరిగింది. 431 మంది నిరుపేద లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం ప్రారంభించుకునేందుకు ఐకెపి మహిళా సంఘాల ద్వారా  లింకేజీ రుణం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ విక్టర్, లోకల్ బాడీస్ చందర్ నాయక్, పిడి హౌసింగ్ విజయ్ పాల్ రెడ్డి, కామారెడ్డి ఆర్డీవో వీణ, హౌసింగ్ డిఇ సుభాష్, ఏఈలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.