06-08-2025 05:11:24 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): జయశంకర్ జయంతిని పురస్కరించుకొని కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో బుధవారం రోజున ఆ మహానీయుడి చిత్రపటం వద్ద వెలిచాల రాజేందర్ రావు(Velchala Rajender Rao) నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ శ్వాసగా ధ్యాసగా లక్ష్యంగా జీవించి కోట్లాదిమంది ప్రజల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని పేర్కొన్నారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ ను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, స్వరాష్ట కలల జెండాను భవిష్యత్తు ఎజెండాను ఆయన ఎప్పటికీ వదిలిపెట్టలేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ కర్త కర్మ క్రియగా వ్యవహరించారనీ, ఆయన సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అందరికీ మార్గదర్శకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. మా తండ్రి జగపతిరావుతో జయశంకర్ సార్ కు ప్రత్యేక ఆత్మీయత.. అనుబంధం ఉందనీ, అనేకమార్లు మా ఇంటికి సార్ వచ్చారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆయన మార్గదర్శకంగా నిలిచారని రాజేందర్ రావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్స్ నేతి కుంట యాదయ్య, గంట కళ్యాణి శ్రీనివాస్, ఆకుల నర్మదా- నర్సన్న, కోటగిరి భూమా గౌడ్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, తాండ్ర శంకర్, అనంతల రమేష్ పటేల్ మరియు గుమ్మడి రాజు కుమార్ ఉన్నారు.